73వ స్వాతంత్ర్య వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. దిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతకాన్ని ఎగరవేశారు. ఎర్రకోటకు చేరుకున్న తర్వాత సైనిక వందనాన్ని స్వీకరించిన ప్రధాని మోదీ... కేంద్ర మంత్రులు, మాజీ ప్రధానులు, త్రివిధ దళాధిపతులు, ప్రముఖులు, ప్రజల సమక్షంలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
'నవభారత ప్రణాళిక' ఆవిష్కరణ...
జెండా ఆవిష్కరణ తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రధాని నరేంద్రమోదీ. నవ భారత నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం నిరంతర కృషిచేస్తోందని ఉద్ఘాటించారు. ప్రతి రంగంలో, ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు తెచ్చేందుకు చేపడుతున్న చర్యలను, నిర్దేశించుకున్న ప్రణాళికలను ఆవిష్కరించారు.
10 వారాల ప్రగతి నివేదిక...
మోదీ 2.0 ప్రభుత్వ తొలి 10 వారాల ప్రగతి నివేదికను ఎర్రకోట వేదికగా ఆవిష్కరించారు ప్రధాని. ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు..., రైతులకు పింఛను వంటి నిర్ణయాలను ప్రస్తావించారు.
అవసరాలు... ఆకాంక్షలు
2014-19 మధ్య తొలి దఫా పాలనలో ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేసినట్లు స్పష్టంచేశారు మోదీ. ఆ ఐదేళ్లలో వచ్చిన మార్పును వివరించారు. "అందరితో కలిసి- అందరికీ ప్రగతి" మంత్రంతో పనిచేసి... తమ ప్రభుత్వం "అందరి విశ్వాసం" చూరగొనగలిగిందని హర్షం వ్యక్తంచేశారు.
2019 ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయాన్ని ప్రస్తావించారు మోదీ. ప్రజల్లో నిరాశ... ఆశగా మారిందనేందుకు ఆ ఫలితాలే నిదర్శనమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం... ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఉద్ఘాటించారు మోదీ.
ఆర్టికల్ 370ని శాశ్వతం ఎందుకు చేయలేదు?
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును ప్రముఖంగా ప్రస్తావించారు ప్రధాని నరేంద్రమోదీ. ఆ అధికరణ కారణంగా జమ్ముకశ్మీర్ ప్రజలు అన్ని రకాలుగా నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితిని మార్చేందుకే తమ ప్రభుత్వం ఈ చారిత్రక నిర్ణయం తీసుకుందని వివరించారు.
ఆర్టికల్ 370 రద్దును తప్పుబడుతున్న విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మోదీ. ఆ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని శాశ్వతం చేయకుండా... ఆర్టికల్ 370ని తాత్కాలిక నిబంధనగానే ఎందుకు ఉంచారని ప్రశ్నించారు.
జమిలీ తక్షణావసరం...
ఆర్టికల్ 370 రద్దుతో ఒకే దేశం- ఒకే రాజ్యాంగం కల సాకారమైందని హర్షం వ్యక్తంచేశారు మోదీ.
జీఎస్టీతో ఒకే దేశం- పన్ను..., విద్యుత్ రంగంలో ఒకే దేశం- ఒకే గ్రిడ్..., రవాణా రంగంలో కామన్ మొబిలిటీ కార్డ్‌తో ఒకే దేశం- ఒకే కార్డ్ ఆకాంక్ష నెరవేరిందని గుర్తుచేశారు.
ఒకే దేశం- ఒకే ఎన్నిక కలను సాకారం చేసుకోవడమే తదుపరి లక్ష్యమని స్పష్టంచేశారు మోదీ. ఇందుకోసం విస్తృత చర్చలు జరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. దేశం మరింత అభివృద్ధి చెందేందుకు జమిలీ ఎన్నికలు తప్పనిసరి అన్నారు మోదీ.
జల్ జీవన్‌తో ఇంటింటికీ తాగునీరు
ఇంటింటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా సరికొత్త పథకాన్ని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. మూడున్నర లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో "జల్ జీవన్ మిషన్" అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
జలసంరక్షణ అవసరాన్ని గుర్తుచేశారు మోదీ. నీటి పొదుపు... ప్రజాఉద్యమంలా మారాలని ఆకాంక్షించారు.
కుటుంబ నియంత్రణ కూడా దేశభక్తే...
నవ భారత నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు ప్రధాని. ప్రధానంగా... జనాభా విస్ఫోటనాన్ని ప్రస్తావించారు.
జనాభా పెరుగుదలతో రానున్న తరాలకు అనేక సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు ప్రధాని. చిన్న కుటుంబం కలిగి ఉండడం ద్వారా దేశాభివృద్ధికి ఉపకరించవచ్చని, అది కూడా ఒక రకమైన దేశభక్తేనని అన్నారు.
జనాభా నియంత్రణకు కేంద్రం, రాష్ట్రాలు ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు మోదీ.
లక్ష్యం చేరాలంటే హైజంప్ తప్పనిసరి...
అభివృద్ధి క్రమక్రమంగా జరుగుతుందిలే అని ప్రజలు ఎదురుచూసే పరిస్థితులు లేవన్నారు ప్రధాని. నవభారత లక్ష్యాలను చేరుకుని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రగతి పథంలో హై జంప్ చేయడం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం తమ ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని వివరించారు.
రూ.100 లక్షల కోట్ల ఖర్చుతో దేశంలో భారీ స్థాయిలో మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు మోదీ.
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు పిలుపు
ఉగ్రవాదంపై అన్ని దేశాలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు ప్రధాని. ముష్కరులను రక్షిస్తూ, వారికి సహాయ సహకారాలు అందించే దేశాలను ప్రపంచ వేదికపై ఎండగట్టాల్సిన అవసరముందంటూ.... పాకిస్థాన్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
సరికొత్త "త్రిశక్తి"...
దేశ భద్రతకు సంబంధించి కీలక ప్రకటన చేశారు ప్రధాని. త్రివిధ దళాల మధ్య మరింత మెరుగైన సమన్వయం, సమర్థమైన నాయకత్వం కోసం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పేరిట ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.