ప్రధానమంత్రి నరేంద్రమోదీపై రాహుల్ గాంధీ పైచేయి సాధించారు. ఫలితాలు అప్పుడే వెలువడ్డాయా అని ఆశ్చర్యపోవద్దు. రాహుల్ పైచేయి సాధించింది ఎన్నికల ప్రచారంలో. ఎన్డీఏ, యూపీఏ కూటమి పార్టీలు సార్వత్రిక సమరంలో నెగ్గేందుకు ఎన్నికల ప్రచారాన్ని నువ్వా-నేనా అన్నట్లు నిర్వహించాయి.
ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బహిరంగ సభలను భారీ స్థాయిలోనే నిర్వహించారు నేతలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు నెలల పాటు క్షణం తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో గడిపారు. మోదీ 142 బహిరంగ సభల్లో పాల్గొని ఎన్డీఏ తరఫున ప్రచారం చేశారు. నాలుగు రోడ్‌షోల్లోనూ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 145 బహిరంగ సభలు నిర్వహించారు. ఎనిమిది మీడియా సమావేశాలు, అయిదు రోడ్‌షోల్లో పాల్గొన్నారు.