భాజపా ఎంపీలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మందలించారు. పార్లమెంట్లో భాజపా ఎంపీల తక్కువ హాజరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మోదీ బిల్లుల ఆమోదం సమయంలో తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారని తెలుస్తోంది.
'మీరు 2 లక్షల మెజారిటీతో గెలిచి మీ స్నేహితుడే ఓటు వేయకపోతే మీరెలా భావిస్తారు. మీ నియోజకవర్గంలో భాజపా అధ్యక్షుడు అమిత్‌షా ర్యాలీ చివరి నిమిషంలో రద్దయితే ఎంత నిరాశకు గురవుతార'ని ప్రశ్నించారు మోదీ. ఎంపీలు లోక్‌సభకు హాజరు కాకపోవడం అలాగే అనిపిస్తుందని వ్యాఖ్యానించారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాసవాన్‌ను చూసి సభకు ఎలా సన్నద్ధమవ్వాలో నేర్చుకోవాలని మోదీ వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
ముమ్మారు తలాక్ బిల్లు ఓటింగ్ సమయంలో గైర్హాజరే కారణం
జూన్ 21న జరిగిన ముమ్మారు తలాక్ బిల్లు ఓటింగ్ సందర్భంగా ఎంపీల గైర్హాజరు నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ముమ్మారు తలాక్ బిల్లుకు అనుకూలంగా 184 ఓట్లు, వ్యతిరేకంగా 74 ఓట్లు వచ్చాయి. భాజపాకు 303 ఎంపీలున్నా బిల్లు సమయంలో సభలో లేకపోవడం మోదీని అసంతృప్తికి గురిచేసిందని సమాచారం.
17వ లోక్‌సభలో తొలిబిల్లుగా ముమ్మారు తలాక్ బిల్లును ప్రవేశపెట్టారు. ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఓటింగ్ నిర్వహించాలని కోరారు.
మోదీకి భాజపా ఎంపీల హాజరు చాలా కాలంగా సమస్యగా మారింది. గత లోక్‌సభలోనూ ఎంపీల హాజరు తక్కువగా ఉండేది.
ఇదీ చూడండి: కర్తార్పుర్పై రెండోసారి భేటీకి పాక్ ప్రతిపాదన