భారత్ మరో మైలురాయి... 'మిషన్ శక్తి' సఫలం త్రివిధ దళాల రూపంలో ఇప్పటికే పటిష్ఠ భద్రతా వ్యవస్థ కలిగిన భారత్... రోదసిలోనూ తిరుగులేని శక్తిగా అవతరించింది. అంతరిక్షం భద్రత విషయంలోనూ అద్భుత పురోగతి సాధించింది.
మిషన్ శక్తి...
భద్రత, ఆర్థిక వృద్ధి, సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకెళ్తోంది. పురోగతి ఎంత అవసరమో... సమాచార భద్రత అంతకన్నా ముఖ్యం. అందుకే అంతరిక్షంలో శత్రువుల ఉపగ్రహాల పనిబట్టడంపై దృష్టిపెట్టింది భారత్. అందుకు అవసరమైన ఆయుధాలు అభివృద్ధి చేసింది.
యాంటీ శాటిలైట్ వెపన్-ఏశాట్ను పరీక్షించేందుకు ఈ ఉదయం "మిషన్ శక్తి" పేరిట ప్రత్యేకం ప్రయోగం నిర్వహించింది. దిగువ భూకక్ష్యలోని ఉపగ్రహాన్ని లక్ష్యంగా ఎంచుకుంది.
శాస్త్రవేత్తలు ఆదేశాలు ఇచ్చిన వెంటనే ఏశాట్ దూసుకెళ్లింది. నిర్దేశిత ఉపగ్రహాన్ని ధ్వంసం చేసింది. ఈ ప్రయోగం మొత్తం 3 నిమిషాల్లో పూర్తయింది.
స్వయంగా ప్రధాని ప్రకటన...
అంతరిక్ష భద్రత కోసం ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఇలాంటి ఆయుధాలు కలిగి ఉన్నాయి. ఏశాట్ పరీక్ష విజయవంతంతో భారత్ అగ్ర దేశాల సరసన చేరింది.
ఇంతటి చారిత్రక విజయంపై ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ప్రకటన చేశారు. ఎన్నికల ముందు అసాధారణ రీతిలో జాతినుద్దేశించి ప్రసంగించారు.
ఆత్మరక్షణ కోసమే...
ఏ-శాట్ అభివృద్ధి వెనుక ఉద్దేశం... ఎవరిపైనో దాడి చేయాలని కాదని మోదీ స్పష్టంచేశారు. రోదసిలో భారతీయ సంపద సంరక్షణకేనని తేల్చిచెప్పారు.
"మిషన్ శక్తి" ప్రయోగమంతా అంతర్జాతీయ నిబంధనలకు లోబడే జరిగిందని ప్రధాని ఉద్ఘాటించారు.