ప్రభుత్వంలోని కీలక శాఖల కార్యదర్శులతో ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. జులై 5న ప్రవేశ పెట్టే వార్షిక బడ్జెట్, ఆర్థిక వ్యవస్థ బలోపేతం, నూతన ఉద్యోగాల సృష్టిపై చర్చించారు. ఈ అంశాల్లో రాబోయే 100 రోజుల్లో ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలపై సమాలోచనలు చేశారు.
ప్రధాని అధికారిక నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక శాఖలోని ఐదుగురు కార్యదర్శులు సహా ప్రధాన శాఖల కార్యదర్శులు, నీతి ఆయోగ్ ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
రూ. 350 లక్షల కోట్ల(5 ట్రిలియన్ల) ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను మార్చేందుకు రానున్న ఐదేళ్లలో చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారని సమాచారం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, పీఎం-కిసాన్ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, కుళాయి ద్వారా అందరికీ మంచినీరు, అందరికీ విద్యుత్ పథకాలూ చర్చకు వచ్చాయి.
వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలపై నిర్మాణాత్మక మార్పులు చేపట్టాలని నీతిఆయోగ్ పాలకమండలి భేటీ సందర్భంగా వ్యాఖ్యానించారు మోదీ. తద్వారా వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను పెంచాలన్నారు. పంట సాగుకు సౌకర్యాలను పెంచి, మద్దతు ధరను అందించాలని ఆకాంక్షించారు.