తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​-రష్యా మధ్య 15 కీలక రంగాల్లో ఒప్పందాలు - పుతిన్​

రెండు రోజుల రష్యా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ అయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. రక్షణ, వైమానిక రంగం సహా 15 కీలక రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. తమ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం దేశాల అంతరాలను దాటి ప్రజలకు చేరుతోందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

భారత్​-రష్యా మధ్య 15 కీలక రంగాల్లో ఒప్పందాలు

By

Published : Sep 4, 2019, 7:54 PM IST

Updated : Sep 29, 2019, 11:02 AM IST

భారత్​-రష్యా మధ్య 15 కీలక రంగాల్లో ఒప్పందాలు

రెండు రోజుల పర్యటనలో భాగంగా రష్యా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. రష్యా తూర్పు ప్రాంతంలోని వ్లాదివోస్తోక్​కు విచ్చేసిన మోదీకి విమానాశ్రయంలో అధికారులు స్వాగతం పలికారు. అనంతరం మోదీ... రష్యా సైనిక దళాల గౌరవ వందనం స్వీకరించారు. రష్యా తూర్పు తీరంలోని సుదూర ప్రాంతాలకు వెళ్లిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీయే కావడం విశేషం.

భారత సంతతితో...

వ్లాదివోస్తోక్​లో తాను బస చేసిన హోటల్‌ వద్ద భారత సంతతి ప్రజలతో మోదీ ముచ్చటించారు. వారితో కరచాలనం చేసి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.

పుతిన్​-మోదీ పడవ ప్రయాణం..

అనంతరం ప్రధాని.....రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో కలిసి జ్వెజ్దా నౌకానిర్మాణ యార్డ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా యార్డులోని సాంకేతక పరిజ్ఞానం గురించి మోదీకి పుతిన్‌ వివరించారు. అక్కడి అధికారులు, సిబ్బందిని అడిగి యార్డు పనితీరు గురించి ప్రధాని తెలుసుకున్నారు. అనంతరం మోదీ, పుతిన్‌ కలిసి పడవలో విహరించారు. జ్వెజ్దా నౌకానిర్మాణ యార్డులో పుతిన్‌ తనను ఆదరించిన తీరు.... హృదయపు లోతులను తాకిందని మోదీ అన్నారు.

తూర్పు ఆర్థిక సదస్సులో...

జ్వెజ్దా నౌకానిర్మాణ యార్డు సందర్శన తర్వాత ప్రధాని, పుతిన్‌ తూర్పు ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్యాను విశ్వసనీయ భాగస్వామి అని మోదీ అభివర్ణించారు. భారత్‌, రష్యా మధ్య ప్రత్యేక, గౌరవనీయ భాగస్వామ్యం విస్తరించడానికి పుతిన్‌ వ్యక్తిగతంగా కృషి చేస్తున్నారని మోదీ ప్రశంసలు కురిపించారు. తనకు రష్యా అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్‌ ఆఫ్‌ ది సెయింట్‌ అపోజిల్​'కు ఎంపిక చేయడం పట్ల పుతిన్‌కు మోదీ ధన్యవాదాలు తెలిపారు.

15 రంగాల్లో ఒప్పందాలు...

భారత్‌-రష్యా 20వ వార్షిక సదస్సుకు మోదీ, పుతిన్‌ హాజరయ్యారు. ఈ సదస్సు వేదికగా ఇరువురు నేతలు ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ద్వైపాక్షిక బంధం సహా వివిధ రంగాల్లో భాగస్వామ్యం పెంపుపై చర్చించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య రక్షణ, వైమానిక, చమురు, విద్యుత్‌, సహజ వాయువు, పెట్రోలియం, వర్తకం సహా 15 రంగాల్లో పరస్పర సహకారంపై ఒప్పందాలు కుదిరాయి.

కశ్మీర్​ ప్రస్తావన..!

ఈ సమావేశం సందర్భంగా పొరుగుదేశం పాకిస్థాన్​ను పరోక్షంగా ప్రస్తావిస్తూ మోదీ వ్యాఖ్యలు చేశారు. ఒక దేశ అంతర్గత విషయాల్లో మరో దేశం జోక్యం చేసుకోవడానికి భారత్‌, రష్యా వ్యతిరేకమని ప్రధాని స్పష్టం చేశారు.

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 ఎత్తివేతపై పాకిస్థాన్ భారత్‌ను విమర్శిస్తున్న నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా రష్యాపై ప్రశంసలు కురిపించిన మోదీ.....రెండు దేశాల మధ్య బంధం కేవలం వాటి రాజధానులకే పరిమితం కాకుండా దానిలో ప్రజలను కూడా చేర్చినట్లు తెలిపారు. చెన్నై-వ్లాదివోస్తోక్ మధ్య తీర ప్రాంత అనుసంధానతపై కూడా అవగాహన కుదిరింది.

"నాది, అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ రాజకీయ ప్రస్థానం కారణంగా రెండు దేశాల మధ్య స్నేహం, సయోధ్య వేగంగా ముందుకు వెళ్లింది. భారత్‌, రష్యా మధ్య ఉన్న ప్రత్యేకమైన, గౌరవప్రద భాగస్వామ్యాన్ని రెండు దేశాల ప్రయోజనాలకు మాత్రమే కాకుండా ప్రజలకు నేరుగా మేలు చేసేలా జోడించాం.

భారత్‌, రష్యా మధ్య సంబంధాలను నేను, పుతిన్‌ నమ్మకం, భాగస్వామ్యంతో కలిపి సరికొత్త ఎత్తులకు తీసుకువెళ్లాం. దీని వల్ల పరిమాణం పరంగానే కాకుండా నాణ్యత రూపంలో కూడా మార్పు వచ్చింది. రెండు దేశాల మధ్య సయోధ్యను ప్రభుత్వ హద్దుల నుంచి బయటకు తీసుకువచ్చి ప్రజలు, ప్రైవేటు వ్యక్తుల సామర్ధ్యాన్ని జోడించాం. ఏ దేశ అంతర్గత వ్యవహారాల్లో అయినా బయటి శక్తులు జోక్యం చేసుకోవడానికి భారత్‌, రష్యా వ్యతిరేకం." - నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఈ సందర్భంగా భారత్‌ను.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక భాగస్వామిగా అభివర్ణించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 11 బిలియన్ డాలర్లకు పెరిగిందన్న పుతిన్‌ అది మరింత పెరగడానికి అవకాశం ఉందన్నారు.

Last Updated : Sep 29, 2019, 11:02 AM IST

ABOUT THE AUTHOR

...view details