మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రైతులు ఉద్యమాన్ని విరమించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత మాజీ ప్రధాని చరణ్ సింగ్ జయంతి(కిసాన్ దివస్) సందర్భంగా రాజ్నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. చరణ్ సింగ్ స్ఫూర్తితో రైతుల కోసం ప్రధాని మోదీ అనేక సంస్కరణలను తీసుకొచ్చారని తెలిపారు.
" నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొంతమంది రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రం వారితో చర్చలు జరుపుతోంది. త్వరలోనే రైతులు ఉద్యమాన్ని విరమించుకుంటారని భావిస్తున్నా"
--రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
చరణ్ సింగ్ రైతుల సంక్షేమం కోసం నిరంతర కృషి చేశారని కొనియాడారు రాజ్నాథ్. రైతుల ఆదాయం పెంచేందుకు ఆయన శ్రమించారని గుర్తు చేశారు. అన్నదాతల వల్లే భారత్ ధాన్యబండాగారంలా మారిందని రైతులను ప్రశంసించారు.