అన్ని రాజకీయ పార్టీల లోక్సభ, రాజ్యసభ సభ్యులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ విందునిచ్చారు. దిల్లీలోని అశోక హోటల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ సహా కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరయ్యారు.
ఎంపీలకు ప్రధాని మోదీ విందు - ప్రధాని మోదీ విందు
అన్ని పార్టీల ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విందు ఇచ్చారు. దిల్లీలోని ఆశోకా హోటల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా నూతనంగా ఎన్నికైన లోక్సభ స్పీకర్ హాజరయ్యారు. కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గైర్హాజరు కాగా గులాంనబీ వచ్చారు.
యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ లాంటి కొందరు ప్రముఖ నేతలు కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. హస్తం పార్టీ తరఫున రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ పాల్గొన్నారు. డీఎంకే ఎంపీ కనిమొళి, ఆమ్ఆద్మీ నుంచి సంజయ్ సింగ్, తెదేపా నుంచి భాజపాలో ఈరోజే చేరిన సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు ఇతర పార్టీల ఎంపీలు హాజరయ్యారు.
లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ సేవలను కార్యక్రమంలో ప్రధాని మోదీ గుర్తు చేశారని పార్టీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు మోదీతో సెల్ఫీలు దిగారని భాజపా నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ చెప్పారు. విందులో తినేందుకు అన్ని శాఖాహార పదార్థాలనే ఏర్పాటు చేశారు.