ఐదేళ్ల పాలన. ఎన్నో సాహసోపేత నిర్ణయాలు. ప్రత్యర్థుల నుంచి అంతులేని విమర్శలు. కొన్నిసార్లు ప్రజలూ ఇబ్బందిపడ్డ పరిస్థితులు. అయినా... ఎక్కడా వెనక్కి తగ్గలేదు. దేశానికి మేలు చేస్తుందనుకున్న నిర్ణయాల అమలులో వెనుకడుగు వేయలేదు నరేంద్ర మోదీ. ఈ వైఖరే... మోదీని ప్రత్యేకంగా నిలిపింది. శక్తిమంతమైన, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగల నేతగా ప్రజల నమ్మకాన్ని మరింత పెంచింది. మరోమారు అధికారం దక్కేందుకు కారణమైంది.
ఐదేళ్లలో మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలలో కొన్ని....
1. పెద్ద నోట్ల రద్దు
2016 నవంబర్ 8... భారత ఆర్థిక చరిత్రలో ఈ తేదీ ఓ మలుపు. ఆ రోజు రాత్రి పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు సంచలనాత్మక ప్రకటన చేశారు ప్రధాని మోదీ.
నల్ల ధనాన్ని నిర్మూలించి అన్ని లావాదేవీలు సక్రమంగా జరిగేలా చూడటానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. నగదు కొరత ఏర్పడింది. కొన్ని నెలలపాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినా... పర్యవసానాలు మంచి ఫలితాలే ఇచ్చినట్లు తెలుస్తోంది. చాలా మంది నిపుణులు, ఆర్థిక వేత్తలు మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఓ మంచి ప్రయత్నంగా ప్రశంసించారు.
పెద్ద నోట్ల రద్దుతో కలిగిన అతిపెద్ద ప్రయోజనం... డిజిటల్ చెల్లింపులు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ)ను ప్రవేశపెట్టి.. ఈ-చెల్లింపులను విస్తరించింది కేంద్రం. డిజిటల్ చెల్లింపులు రికార్డు స్థాయిలో వేల కోట్లకు చేరాయి.
2. వస్తు సేవల పన్ను(జీఎస్టీ)
దేశంలో అన్ని రంగాల పురోగమనమే లక్ష్యంగా తీసుకొచ్చిన జీఎస్టీ... సమాఖ్య స్ఫూర్తికి చక్కటి ఉదాహరణ. స్వాతంత్ర్యానంతరం అమల్లోకి వచ్చిన అతిపెద్ద పరోక్ష పన్నుల సంస్కరణగా ప్రశంసలొచ్చాయి. సామాన్యులు ఎక్కువగా ఉపయోగించే వస్తువులపై పన్ను భారం బాగా తగ్గింది. భాజపా ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందరో ప్రముఖ విశ్లేషకులు, ప్రపంచవ్యాప్తంగా నిపుణులు కొనియాడారు.
మొదట్లో జీఎస్టీ శ్లాబుల విధానంపై కొన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. అనంతరం వరుస సమావేశాలు నిర్వహిస్తున్న జీఎస్టీ మండలి.. పన్ను శాతాల్ని వస్తువుల వారీగా తగ్గిస్తూ కొంత మేర సానుకూలంగా వ్యవహరిస్తోంది. నెల నెలా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ దూసుకెళ్తోంది.
జీఎస్టీ వల్ల కలిగిన పెద్ద ప్రయోజనం.. పన్ను చెల్లింపుదార్ల సంఖ్య పెరగడమే. రిటర్నులూ పెరిగాయి. దీర్ఘకాలంగా మంచి ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నారు నిపుణులు.
3. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్