జమ్ముకశ్మీర్‌లో కొత్త నాయకత్వం ఉద్భవిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్రంలోని యువత నుంచి కొత్త నాయకులు పుట్టుకొస్తారని ధీమా వ్యక్తం చేశారు.
గురువారం జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి అందించే ఆర్టికల్ 370 రద్దుపై జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు. ఒక్క కశ్మీర్లో తప్ప.. దేశ విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ సంపూర్ణ హక్కులు లభించాయని మోదీ వెల్లడించారు. వారికి లోక్‌సభ ఎన్నికలను మినహాయిస్తే.. స్థానికి సంస్థల ఎన్నికల్లో పాల్గొనే అవకాశం దక్కలేదన్నారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్రంలో గ్రామ పంచాయతీ నుంచి అసెంబ్లీ వరకు అన్నింట్లోనూ ప్రజలకు భాగస్వామ్యం ఉంటుందన్నారు.
'కశ్మీర్లో కొత్త నాయకత్వం ఉద్భవిస్తుంది'
"జమ్ముకశ్మీర్‌లోని అన్న చెల్లెల్లకు ఒక విషయం మరింత స్పష్టం చేయాలనుకుంటున్నా. మీ ప్రతినిధిని మీరే ఎన్నుకుంటారు. మీ నుంచే మీ ప్రతినిధి వస్తారు. ఎలాగైతే ఇంతకుముందు మీకు సీఎం ఉన్నారో.. ఇప్పుడూ అదే విధంగా ముఖ్యమంత్రి ఉంటారు. నాకు చాలా నమ్మకం ఉంది. ఈ కొత్త వ్యవస్థతో ఉగ్రవాదుల నుంచి జమ్ముకశ్మీర్‌ను విముక్తి చేస్తాం."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
లోక్‌సభలో ఇప్పటివరకు రాష్ట్రంలోని కొన్ని కుటుంబాలే పోటీ చేసేవని ప్రధాని ఆరోపించారు. ఇకపై అలా జరగదని.. ఆర్టికల్ 370 రద్దు ఫలితాలను త్వరలోనే దేశప్రజలు చూస్తారని ధీమా వ్యక్తం చేశారు మోదీ.
ఆర్టికల్ 370 రద్దు తీర్మానం, జమ్ముకశ్మీర్ విభజన బిల్లుకు పార్లమెంటు ఇటీవలే ఆమోదం తెలిపింది.
ఇదీ చూడండి- సుష్మ ప్రపంచంలోనే అత్యుత్తమ మహిళ :ఇవాంక