సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఘనవిజయం సాధించిన ఉత్సాహంతో మోదీ సర్కార్ పార్లమెంటులో శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టింది. నవభారత నిర్మాణమే ధ్యేయంగా.. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ. 27 లక్షల 86 వేల 349 కోట్ల అంచనాతో వార్షిక పద్దు సమర్పించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
కోట్లాది ప్రజల అంచనాలు, ఆకాంక్షల నడుమ బడ్జెట్ తీసుకొచ్చిన ప్రభుత్వం.. దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తామని పేర్కొంది. వ్యవస్థీకృత సంస్కరణలే ఎజెండాగా పద్దును తీసుకొచ్చింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే ఆశయంతో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేసింది కేంద్రం.
సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన కోసం విదేశీ పెట్టుబడులను ఆహ్వానించింది. రూ. 5 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్నులో ఎలాంటి మార్పులు చేయని కేంద్రం... దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా భావించే మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రోత్సహించే విధంగా కార్యచరణ ప్రకటించింది.
సామాన్యులకు భారీ వరాలు ప్రకటించకపోయినా... జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రధానాంశంగా కీలక కార్యక్రమాలు ప్రకటించింది.
పెట్రోల్, డీజిల్‌పై సుంకం పెంపు...
ఇంధన ధరలు సామాన్యులకు మరింత భారమయ్యాయి. తక్షణ భారం మోపి సామాన్యులు, మధ్యతరగతి ప్రజల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది కేంద్రం. పెట్రోల్, డీజిల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 1 చొప్పున పెంచారు. వాటిపై రోడ్డు మౌలిక వసతుల సెస్సునూ లీటరుకు రూ.1 చొప్పున పెంచుతున్నట్లు తెలిపారు ఆర్థిక మంత్రి.
ఈ సెస్సుతో సామాన్యులు ఇబ్బంది పడనున్నారు. ప్రయాణ ఛార్జీల నుంచి నిత్యావసర వస్తువుల పైనా ఇది ప్రభావాన్ని చూపనుంది.
ఆదాయపు పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా ఉంచారు. బంగారంపై కస్టమ్స్ సుంకం 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచి అసంతృప్తికి గురిచేశారు. గృహ రుణాలకు మాత్రం స్వల్ప వెసులుబాటు కల్పించారు.
సంపన్నులపై పన్ను...
ధనిక వర్గాలపై పన్ను మోత మోగించింది. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ వార్షికాదాయం సంపాదించే వారు గరిష్ఠంగా 42 శాతం పన్ను కట్టాల్సుంటుంది. దాదాపు 75 వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచారు.
మొత్తంగా బడ్జెట్.. ధనిక వర్గాలపై భారం, మధ్య తరగతివారితో ఇచ్చిపుచ్చుకునే ధోరణి, ప్రజాకర్షక పథకాలకు కోత విధించడం అన్న ధోరణిలో సాగింది.
ఆధార్‌తోనూ ఐటీ..
ఆదాయపు పన్ను(ఐటీ) రిటర్నులు దాఖలు చేసేందుకు పాన్ అవసరమన్న నిబంధనను తాజా బడ్జెట్లో తొలగించారు. పాన్‌తో పాటు ఆధార్ సంఖ్య ఆధారంగానూ రిటర్నులు దాఖలు చేయొచ్చు.