ఉత్తర్‌ప్రదేశ్‌లో 13ఏళ్ల బాలిక హత్యాచారానికి గురైన ఘటన మరవకముందే మరో మైనర్ బాలిక అత్యాచారం, హత్యకు గురైంది. ఆగస్టు 15వ తేదీన ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, అత్యంత పాశవికంగా హత్యచేసిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అదే ప్రాంతంలో తాజాగా మరో 17ఏళ్ల బాలికపై ఇదే తరహాలో అఘాయిత్యానికి పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీ జిల్లాలో ఈ వరుస ఘటనలు వెలుగు చూశాయి. స్థానిక నీమ్‌గాన్ పోలీసుల ప్రకారం, 17ఏళ్ల బాలిక సోమవారం ఉదయం స్కాలర్‌షిప్ దరఖాస్తు నింపేందుకు ఇంటి నుంచి సమీప గ్రామానికి వెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. అమ్మాయి కోసం గాలిస్తున్న క్రమంలో రెండురోజుల అనంతరం గ్రామ శివారులో చెరువు నుంచి దుర్వాసన రావడంతో అక్కడికి వెళ్లి చూశారు. శరీర భాగాలు ముక్కలుగా పడివున్న బాలిక మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టంలో ఆమె అత్యాచారానికి గురైనట్లు వైద్యులు నిర్ధారించారని లఖీంపూర్ ఖేరీ ఎస్పీ సతేంద్ర కుమార్ సింగ్ మీడియాకు వెల్లడించారు. నిందితులకు సంబంధించిన ఆనవాళ్లు లభించాయని, వారికోసం ప్రత్యేక పోలిసు బృందం గాలిస్తోందని చెప్పారు.
17ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య - యూపిలో మరో బాలికపై అత్యాచారం
ఉత్తర్‌ప్రదేశ్‌లో బాలికలపై అత్యాచార ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. 13 ఏళ్ల బాలిక హత్యచారానికి గురైన ఘటన మరవకముందే మరో మైనర్ పై ఇదే తరహా అఘాయిత్యానికి పాల్పడ్డారు దుండగులు. మొదటి ఘటన జరిగిన లఖీంపూర్ ఖేరీ జిల్లాలోనే ఈ విషాదం జరగటం ఆందోళన కలిగిస్తోంది.
ఇదిలా ఉంటే, 10రోజుల క్రితం అదే జిల్లాలోని ఇసానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దుండగులు 13ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇలా వరుస ఘటనలు వెలుగులోకి వస్తుండడంతో ఆప్రాంతంలో ఆందోళన వ్యక్తమవుతోంది. వీటికి ముందు కొన్ని రోజుల క్రితమే హర్పూర్ ప్రాంతంలో 6సంవత్సరాల చిన్నారి కూడా అత్యాచారానికి గురై, ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో వరుసగా మైనర్ బాలికలపై జరుగుతున్న దారుణ ఘటనలపై ప్రజాసంఘాలు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.