లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా నిలిచిపోయిన మెట్రో రైళ్లు ఇవాళ పునఃప్రారంభమయ్యాయి. అన్‌లాక్-4లో భాగంగా మెట్రోరైళ్ల నడిపేందుకు కేంద్రం అనుమతివ్వగా.. మహారాష్ట్ర మినహా మిగిలిన ప్రాంతాల్లో సేవలను పునరుద్ధరించారు.
కరోనా నేపథ్యంలో మూతపడిన దిల్లీ మెట్రో.. 169 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం ఉదయం 7 గంటలకు మళ్లీ కూతపెట్టింది.
అయితే, మూడు దశల్లో సేవలను పునరుద్ధరించనున్నట్లు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వెల్లడించింది. మొదటి దశలో భాగంగా ప్రారంభమైన యెల్లో లైన్ (సమయ్‌పుర్ బడ్లీ- హుడా సిటీ సెంటర్), గురుగ్రామ్‌లోని ర్యాపిడ్ లైన్లలో పరిమిత సంఖ్యలో సేవలను అందించనున్నట్లు స్పష్టం చేసింది.