ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో ఎన్డీఏ కూటమి అత్యధిక సీట్లు సాధిస్తుందని తేలింది. ఈ నేపథ్యంలో ఎస్పీ, బీఎస్పీ మహాకూటమి ఆచితూచి వ్యవహరిస్తుంది. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతితో సమావేశం అయ్యారు. లఖ్‌నవూలోని మాయావతి నివాసానికి వెళ్లిన అఖిలేశ్ సుమారు గంటసేపు మంతనాలు జరిపారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. దాదాపు అన్ని సర్వే సంస్థలు భాజపాకు అనుకూల ఫలితాలు వెల్లడించిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో మహాకూటమి భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడితో నిన్న విడివిడిగా సమావేశం అయిన ఇరువురు నేతలు కేంద్రంలో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోతే భాజపాయేతర పక్షాలతో అధికారంలోకి రావడానికి గల అవకాశాలను చర్చించారు. 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ 38, ఎస్పీ 37 స్థానాల్లో కలిసి పోటీ చేయగా మరో మూడు స్థానాలను మిత్రపక్షం ఆర్ఎల్డీకి కేటాయించారు.