బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ ఆల్వార్ సామూహిక అత్యాచారం కేసుపై మోదీ ఆరోపణలను తిప్పికొడుతూ... తీవ్ర విమర్శలు చేశారు. అత్యాచారం కేసుపైనా మోదీ రాజకీయాలు చేస్తున్నారని లఖ్నవూలో మండిపడ్డారు మాయావతి.
"తన (మోదీ) స్వార్థ రాజకీయాల కోసం సొంత భార్యనే వదిలేశారు. అంతేకాదు నాకు మరో విషయం తెలిసింది. భాజపాలోని మహిళా నేతలు తమ భర్తలు మోదీని కలిస్తే ఆందోళన చెందుతున్నారు. తనలానే.. భార్యను వదిలేయమని మోదీ వాళ్లకు చెబుతారేమోనని భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని మహిళలకు నా విజ్ఞప్తి ఒకటే. ఇలాంటి వ్యక్తికి మీరు ఓటు వేయకండి. ఇదే ఆయన వదిలేసిన భార్యకు నిజమైన గౌరవం కూడా."
- మాయావతి, బీఎస్పీ అధినేత్రి
ఆల్వార్ అత్యాచారం కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని తేల్చిచెప్పారు మాయ.