తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా మహమ్మారి కట్టడి సాధ్యమే.. కానీ'

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్​ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చర్యలు ముమ్మరం చేసింది కేంద్రం. వైరస్​ను నిలువరించటం సాధ్యమేనని పలు మ్యాథెమాటికల్​ మోడలింగ్​ అధ్యయనాలు సూచిస్తున్నట్లు పేర్కొంది. అయితే.. మనుషుల నుంచి మనుషుల మధ్య వ్యాప్తి ఉండటం వల్ల అది కచ్చితంగా సాధ్యపడుతుందని చెప్పలేమని తెలిపింది.

containment of COVID-19 possible
'కరోనా మహమ్మారి కట్టడి సాధ్యమే'

By

Published : May 17, 2020, 11:52 AM IST

కొవిడ్​-19 మహమ్మారిని కట్టడి చేయటం సాధ్యమేనని పలు మ్యాథెమాటికల్​ మోడలింగ్​ అధ్యయనాలు సూచిస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే.. మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుండటం వల్ల వైరస్​ కట్టడి చేసే కార్యక్రమాలు కచ్చితంగా విజయవంతమవుతాయని హామీ ఇవ్వలేమని అభిప్రాయపడింది. ఇప్పటి వరకు కరోనాకు చికిత్సకు సరైన ఔషదం, వ్యాక్సిన్​ లేవని.. తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి, ఆరోగ్య సిబ్బందికి క్రెమొప్రోఫిలాక్సిస్​, హైడ్రాక్సీక్లోరోక్విన్లు​ సిఫార్సు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

కరోనా వైరస్​ను మరింత వేగంగా వ్యాప్తి చేయగలిగే క్లస్టర్లు గుర్తించిన నేపథ్యంలో కంటెయిన్​మెంట్​ ప్రణాళికను రచించినట్లు ఓ ప్రకటన విడుదల చేసింది ఆరోగ్య శాఖ.

క్లస్టర్​ కంటెయిన్​మెంట్​ వ్యూహం...

కేసులను త్వరితంగా గుర్తించటం, సంక్రమణ గొలుసును అడ్డుకోవటం, కొత్త ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా చూసుకోవటం ద్వారా నిర్ణీత ప్రాంతం పరిధిలోనే వైరస్​ వ్యాప్తిని కట్టడి చేయటమే క్లస్టర్ కంటెయిన్​మెంట్​​ వ్యూహం లక్ష్యం. జాతీయ స్థాయిలో సంస్థాగత యంత్రాంగాలు, అంతర్గత విభాగాల సమన్వయంతో పనిచేస్తాయని... జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ (ఎన్​సీఎంసీ), సెక్రెటరీస్​ కమిటీ (సీఓఎస్​)లు రంగంలోకి దిగుతాయని వెల్లడించింది. సమస్యలు గుర్తించిన ప్రాంతాల్లో ఆరోగ్య, ఆరోగ్యయేతర రంగాలతో ఎన్​సీఎంసీ సమన్వయం చేస్తూ పనిచేస్తుందని పేర్కొంది.

"సమస్య తీవ్రంగా ఉన్న రాష్ట్రాలు కరోనా క్లస్టర్లలలో నియంత్రణ చర్యలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిటీని రంగంలోకి దించాలి. తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సమావేశం నిర్వహిస్తాం. వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు భౌగోళిక క్వారంటైన్​ అనుసరించాలి. ఇది వైరస్​ వ్యాపించిన ఇతర ప్రాంతాల నుంచి ప్రయాణాలను పూర్తిగా నిషేధించాలని సూచిస్తోంది. పెద్ద మొత్తంగా కేసులు నమోదైన ప్రాంతాలు లేదా బహుళ క్లస్టర్లు ఉన్న ప్రాంతాలకు భౌగోళిక క్వారంటైన్ వర్తిస్తుంది. ఈ కంటెయిన్​మెంట్​ వ్యూహంలో భౌగోళిక క్వారంటైన్, భౌతిక దూరం పాటించటం, నిఘా పెంచటం, అనుమానాస్పద ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించటం, నిర్ధరణ అయిన వారిని నిర్బంధించటం, ప్రజలకు అవగాహన కల్పించటం వంటివి ఉన్నాయి."

– కేంద్ర ఆరోగ్య శాఖ. ​

క్లస్టర్ల సంఖ్య, పరిమాణం, భారత జనాభాలో వైరస్​ ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది.. వంటి విషయాలు భౌగోళిక క్వారంటైన్​ ద్వారా వైరస్​ వ్యాప్తి కట్టడి కార్యక్రమాల ఫలితాలను నిర్ధరిస్తాయని తెలిపింది కేంద్రం.

ABOUT THE AUTHOR

...view details