జేఎన్‌యూలో కాళరాత్రి- కర్రలతో విద్యార్థులపై దాడి దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మరోసారి వార్తల్లో నిలిచింది. చదువుల నిలయంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కొంత మంది దుండగులు మాస్కులతో యూనివర్సిటీలోకి ప్రవేశించి విద్యార్థులపై కర్రలతో, హాకీ స్టిక్కులతో దాడికి తెగబడ్డారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న క్యాంపస్ వాతావరణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏం జరుగుతోందో అర్థమయ్యే సరికే.. దుండగులు విద్యార్థులను నెత్తురోడేలా కొట్టారు.
ఆదివారం సాయంత్రం మొదలైన ఈ ఘటనలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోష్ సహా 28మంది తీవ్రంగా గాయపడ్డారు.
టీచర్స్ అసోసియేషన్ సమావేశంలో...
జేఎన్‌యూ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశంలోకి ఒక్కసారిగా దుండగులు ప్రవేశించి కర్రలతో విరుచుకుపడినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనంతరం మూడు హొటళ్లల్లోకి చొరబడి అద్దాలు, మంచాలు నాశనం చేసినట్టు పేర్కొన్నారు.
మీ పనే.. కాదు మీ పనే...
దాడి అనంతరం వామపక్ష భావజాలం ఉన్న జేఎన్‌యూఎస్‌యూ.. ఆర్ఎస్ఎస్ మద్దతు గల ఏబీవీపీ.. పరస్పరం ఆరోపణల వర్షం కురిపించుకున్నాయి. తమ కార్యకర్తలు, విద్యార్థులపై రాళ్లు రువ్వి దాడికి పాల్పడినట్లు ఆరోపించింది విద్యార్థి సంఘం. తమ కార్యకర్తలపై విద్యార్థి సంఘం సభ్యులు చేయి చేసుకున్నారని మండిపడింది ఏబీవీపీ.
ఘటన నేపథ్యంలో వర్సిటీ యాజమాన్యం పోలీసుల సహాయం తీసుకుంది. వెంటనే స్పందించిన దిల్లీ పోలీసులు... జేఎన్‌యూలో భారీగా బలగాలను మోహరించారు. కొద్ది సేపటికి పరిస్థితి అదుపు చేసినట్టు ప్రకటించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జేఎన్‌యూలో ఉద్రిక్త పరిస్థితులపై దిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్యా పట్నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై సీనియర్ అధికారితో విచారణ జరిపించాలని ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు విద్యార్థుల దాడిపై నివేదిక సమర్పించాలని వర్సిటీ రిజిస్ట్రార్‌ను కోరింది కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ.
జేఎన్‌యూ ప్రకటన...
అమానుష ఘటన చోటుచేసుకున్న కొద్ది గంటలకు జేఎన్‌యూ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. సెమిస్టర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియపై రెండు వర్గాల మధ్య వివాదం మొదలై.. తీవ్ర పరిణామాలకు దారి తీసిందని స్పష్టం చేసింది. వింటర్ సెమిస్టర్ కోసం తరగతి భవనాలకు వెళుతున్న విద్యార్థులను జేఎన్‌యూఎస్‌యూ సభ్యులు అడ్డుకున్నట్టు వివరించింది. పెంచిన హాస్టల్ ఫీజులు తగ్గించే వరకూ లోపలికి ప్రవేశించకూడదని డిమాండ్ చేసినట్టు తెలిపింది. ఈ పరిణామాలు ఘర్షణకు దారి తీశాయని పేర్కొంది.
విశ్వవిద్యాలయంలో హింసకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన జేఎన్‌యూ... పూర్తి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు స్పష్టం చేసింది. విషాదకర పరిణామాల్లో విద్యార్థులకు అండగా ఉండనున్నట్టు తెలిపింది.
అధ్యాపకుల అనుమానం...
అయితే వర్సిటీలో జరిగిన అమానుష ఘటనపై పలువురు ఉపాధ్యాయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంత భారీ సంఖ్యలో గుర్తుతెలియని వ్యక్తులు.. రాడ్లతో విశ్వవిద్యాలయంలోకి ఎలా ప్రవేశించారని ప్రశ్నించారు. దీని వెనుక రాజకీయ నేతల హస్తం ఉందనే ఆరోపణలూ వ్యక్తమవుతున్నాయి.