అది డిసెంబర్ 8, 2020. మహారాష్ట్ర- ప్రతాప్‌గఢ్‌లోని కుందా గ్రామానికి చెందిన ఆర్తి మౌర్య ఇల్లు అందంగా ముస్తాబైంది. కొన్ని గంటల్లో పెళ్లికొడుకు బారాత్‌తో ఆ ఇంటికి రానున్నాడు. అతిథులను సాదరంగా ఆహ్వానించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ.. ఒక్కసారిగా మొత్తం తలకిందులైంది. అప్పటివరకూ ఇంట్లో నెలకొన్న సందడి హఠాత్తుగా మాయమై, విషాద వాతావరణం కమ్మేసింది.
"మేడ మీద ఓ పిల్లాడు పరిగెడుతున్నాడు. ఆర్తి పిలుస్తున్నా వినిపించుకోకుండా పరిగెడుతూనే ఉన్నాడు. ఆ పిల్లాణ్ని పట్టుకునేందుకు ప్రయత్నించిన ఆర్తి జారిపడిందో, లేదా టెంట్ స్తంభమో కూలిందో తెలీదు కానీ.. నా బిడ్డ కిందపడిపోయింది. ఆ సమయంలో నలుగురు చిన్నపిల్లలు తప్ప పైన ఎవరూ లేరు."
- ఆర్తి తండ్రి
నవ వధువుగా తయారై.. ఆపై స్ట్రెచర్‌పై..
అందంగా ముస్తాబై, నవ వధువుగా అత్తారింటికి వెళ్లాల్సిన ఆర్తి.. స్ట్రెచర్‌పై పడుకుంది. ఆనందంతో వెలిగిపోయిన ఆమె కుటుంబసభ్యుల ముఖాలు ఆ ఊహించని ఘటనతో పేలవంగా మారిపోయాయి.
"మాకిది పెద్ద షాక్. పెళ్లి మళ్లీ అవుతుందో లేదో నమ్మకం లేదు."
- ఆర్తి సోదరి
వెన్నెముక విరిగి, ఒళ్లంతా గాయాలు..
ఇంకో 8 గంటల్లో పెళ్లి అనగా.. జరిగిన ప్రమాదం ఆర్తి కుటుంబ సభ్యులను, బంధువులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది. ఆరతి కాలు జారి మేడమీద నుంచి పడిపోయింది. ఆమె వెన్నెముక విరగడం సహా.. ఒళ్లంతా తీవ్రగాయాలయ్యాయి. అంతటి విషమ పరిస్థితిలో ఉన్న ఆర్తికి వైద్యం చేసే సదుపాయాలు లేక, దగ్గర్లోని ఆసుపత్రులన్నీ చేర్చుకునేందుకు నిరాకరించాయి. చివరకు ప్రయాగ్‌రాజ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆర్తిని చేర్చిపించారు.
"తన శరీరం పైభాగం మొత్తం బాగానే ఉన్నా.. నడుము కింది భాగానికి రక్తసరఫరా జరగడం ఆగి పోయిందని వైద్యులు చెప్తున్నారు. ఆమెను పీజీఐకి తీసుకెళ్లాం. కానీ.. అక్కడ క్యూలో నిలబడాల్సి వచ్చింది. న్యూరో సర్జన్ సచిన్ సింగ్ వైద్యం చేస్తున్నారు. పీజీఐకి తీసుకెళ్లడంలో అధికారుల నుంచి, స్థానిక ఎంపీ నుంచి మాకు సహకారం అందుతోంది. ఇంకా అక్కడికి వెళ్లాలి."
- ఆర్తి తండ్రి
మంచానికే పరిమితం..
ఆర్తి ఆరోగ్య పరిస్థితి పరీక్షించిన తర్వాత.. కొన్ని నెలల పాటు ఆమె మంచానికే పరిమితం అవుతుందని కుటుంబ సభ్యులకు చెప్పారు వైద్యులు. ఇదంతా జరిగిన తర్వాత తమ బిడ్డను పెళ్లి చేసుకునేందుకు పెళ్లికొడుకు తరపువారు ఒప్పుకోరనే అనుకున్నారు ఆరతి తల్లిదండ్రులు.
"మా అక్కను తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోనని పెళ్లికొడుకు చెప్పడం మాకు చెప్పలేని ఆనందం కలిగించింది."
- ఆర్తి సోదరి