గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు సీబీఐ అధికారులమని చెప్పి ఏకంగా మణిపుర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ సోదరుడు టోంగ్‌బ్రామ్ లుఖోయ్ సింగ్‌ను కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగిన గంట వ్యవధిలోనే పోలీసులు లుఖోయ్ను రక్షించి ఆ ఐదుగురు నిందితులను పట్టుకున్నారు.
ఇదీ జరిగింది...
లుఖోయ్ సింగ్ కోల్‌కతాలో నివాసం ఉంటున్నారు. ఐదుగురు వ్యక్తులు సీబీఐ అధికారులమని చెప్పి శుక్రవారం ఆయన నివాసంలోకి చొరబడ్డారు. తుపాకీలతో బెదిరించి లుఖోయ్తో పాటు మరో వ్యక్తిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత లుఖోయ్ భార్యకు ఫోన్ చేసి రూ.15 లక్షలు డిమాండ్ చేశారు నిందితులు.
ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వగా... గంట వ్యవధిలోనే కేసును చేధించారు పోలీసులు. సెంట్రల్ కోల్‌కతాలోని బెనియాపుర్ ప్రాంతంలో బందీగా ఉన్న లుఖోయ్ను రక్షించారు. ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. రెండు వాహనాలు, మూడు నకిలీ తుపాకులు, రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల్లో ఇద్దరు మణిపుర్, మరొకరు పంజాబ్‌కు చెందిన వారు. వీరిలో ఇద్దరిపై గతంలో క్రిమినల్ కేసులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.
సులభంగా డబ్బును సంపాదించాలనే ఉద్దేశంతోనే కిడ్నాప్ చేశారని పోలీసులు విచారణలో తేల్చారు. మణిపుర్‌కు చెందిన వ్యక్తి ఇందుకు వ్యూహరచన చేసి, అక్కడి నుంచే కథను నడిపించాడని గుర్తించారు.
ఇదీ చూడండి:భరత నాట్య కళాకారిణి లీలా శాంసన్‌పై సీబీఐ కేసు