కర్ణాటకలో 76 వసంతాల రాత్రిబడి! ఆ రాత్రిబడి దేశంలోనే మొదటిసారి స్థాపితమైంది. ఈ ఏటితో 76 వసంతాలు పూర్తి చేసుకుంది. పూర్తి ఉచితంగా రాత్రిపూట విద్య అందించే ఆ పాఠశాలే... కర్ణాటక మంగళూరులోని 'నవభారత్ నైట్ హైస్కూల్'.
స్వాతంత్య్రానికి పూర్వం 1943లో హజీ ఖలీద్ ముహమ్మద్ ఒక మంచి ధ్యేయంతో స్థాపించిన ఈ నవభారత్ నైట్ హైస్కూల్... నేడు దేశాన్నంతటినీ ఆకర్షిస్తోంది. ఎంతో మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్ది అద్భుతం చేసింది.
ఇక్కడ ప్రాథమిక విద్య నుంచి పదోతరగతి వరకు ఉంది. సాధారణ విద్య పొందలేని వారి కోసం.. ప్రత్యేకంగా రాత్రిపూట బడులు నిర్వహిస్తూ విద్యనందిస్తున్నారు.
ఈ పాఠశాలలో 1943 నుంచి 1964 వరకు మద్రాసు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించేది. 1964 నుంచి కర్ణాటక డిపార్ట్మెంట్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్... ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు నిర్వహిస్తోంది. దాతల నుంచి సేకరించిన విరాళాలతో నవభారత్ ఎడ్యుకేషన్ సొసైటీ ఈ రాత్రి పాఠశాలను నిర్వహిస్తోంది. సాయంత్రం 6 గంటల నుంచి 9 వరకు తరగతులు జరుగుతాయి. ప్రస్తుతం 40 మంది చదువుకొంటున్న ఈ పాఠశాలలో 20 మంది 10వ తరగతి విద్యార్థులున్నారు.
ఈ పాఠశాలలో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాలను అధిరోహించారు. వైద్యులు, ఇంజనీర్లు, వివిధ రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు.
ఇదీ చూడండి: రైతుబిడ్డ: కళ్లు చెమర్చిన కలెక్టరమ్మ!