ఈ నెల 1వ తేదీన జరిగిన షహీనబాగ్ కాల్పులకు సంబంధించి సంచలన ప్రకటన చేశారు దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన వారిపై కాల్పులకు తెగబడ్డ కపిల్ అనే వ్యక్తి... ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడని తెలిపారు. కపిల్.. అతడి తండ్రి ఏడాది క్రితమే పార్టీలో చేరినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు.
కాల్పుల ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. ఇందులో భాగంగా కపిల్ ఫోన్లో ఉన్న ఫొటోల ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధరించినట్టు స్పష్టం చేశారు. కపిల్‌ను రెండు రోజుల రిమాండ్‌కు తరలించినట్టు క్రైమ్ బ్రాంచ్ డీసీపీ రాజేశ్ దియో తెలిపారు.
"ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపాం. కపిల్‌ను, అతడి సన్నిహితుడిని ట్రాక్ చేశాం. కాల్పులకు పాల్పడిన రోజు.. కపిల్ ఫోన్‌ను ట్రాక్ చేశాం. కానీ అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాత... కపిల్ వద్ద సెల్‌ఫోన్ లేదని తెలుసుకున్నాం. కపిల్‌కు సంబంధించిన ప్రాంతాల్లో రైడ్లు నిర్వహించి క్రైమ్ బ్రాంచ్ అతడి చరవాణిని సంపాదించింది. ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టాం. కానీ అందులోని ఫొటోలు తొలగించారని గుర్తించారం. సాంకేతిక నిపుణుల సాయంతో ఫొటోలను సంపాదించాం. ఆమ్ ఆద్మీతో సంబంధాలున్నట్టు గుర్తించాం. 2019 జనవరి-ఫిబ్రవరి సమయంలో తన తండ్రితో కలిసి ఆప్‌లో చేరినట్టు కపిల్ అంగీకరించాడు."
-- రాజేశ్ దియో, క్రైమ్ బ్రాంచ్ డీసీపీ.