ఆయన దుస్తులంతా నినాదాలే... 'అవేర్నెస్ డాడీ' తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఓ వ్యక్తి స్వచ్ఛందంగా రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తున్నాడు. 14 ఏళ్లుగా రహదారి భద్రతకు సంబంధించిన నినాదాలను తన దుస్తులపై ధరిస్తున్నాడు. ఏదో ఒక నినాదం దుస్తులపై ముద్రించుకుంటాడులే... అని తేలిగ్గా తీసేయకండి. పాదరక్షలు మినహా... ధరించే శిరస్త్రాణం నుంచి మొత్తం నినాదాల మయమై ఉంటాయి ఆయన ధరించే దుస్తులు. నడిపే వాహనమూ అంతే. 'అవేర్నెస్ డాడీ'గా పిలుచుకునే ఈ రహదారి భద్రత సామాజిక కార్యకర్తపై ఓ లుక్కేద్దాం రండి.!
తమిళనాడులోని తిరుప్పూర్‌కు చెందిన శివసుబ్రహ్మణ్యం... గత 14 ఏళ్లుగా రహదారి భద్రతపై తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో సహా భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో అవగాహన నిర్వహించాడు. తిరుప్పూర్‌లో శాస్తా మోటర్స్ పేరుతో ద్విచక్రవాహనాల వ్యాపారాన్ని నిర్వహిస్తుంటాడు.
'హెల్మెట్ ధరించండి.!', 'రహదారి భద్రతా నియమాలను పాటించండి', 'నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపకండి'... అంటూ తన దుస్తుల ద్వారా సందేశమిస్తాడు శివసుబ్రహ్మణ్యం.
కార్యక్రమాన్ని ప్రారంభించిన తొలిరోజుల్లో సైకిల్ ద్వారా అవగాహన చేపట్టేవాడు. ఆయన అంకిత భావాన్ని చూసిన ఓ మోటార్ వాహనాల కంపెనీ శివసుబ్రహ్మణ్యంకు ఓ వాహనాన్ని బహుమతిగా ఇచ్చింది. జులై 16వ తేది నుంచి తమిళనాడులోని 32 జిల్లాల వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నాడు. ఈ రహదారి భద్రత పైనే కాదండోయ్ రక్తదానం, అవయవ దానం పైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.
రక్తదానం, కంటిదానం, అవయవ దానంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాను. ప్రస్తుతం తమిళనాడులోని 32 జిల్లాల్లో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాను. ప్రస్తుతం తెనీలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. రహదారి భద్రతా నియమాలు పాటించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా చనిపోతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కలిగి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటిస్తారని భావిస్తున్నాను.-శివసుబ్రహ్మణ్యం, సామాజిక కార్యకర్త