తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐపీఎస్​ల బదిలీలు ఆక్షేపణీయం: ఈసీకి దీదీ లేఖ - ఎన్నికల కమిషన్

ఐపీఎస్​ల బదిలీలపై పశ్చిమ్​ బంగ​ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. బదిలీల చర్య సరైంది కాదన్నారు. పక్షపాతం ధోరణిలో ఈసీ నిర్ణయాలు తీసుకుందని ఆక్షేపించారు.

ఐపీఎస్​ల బదిలీలు ఆక్షేపణీయం: ఈసీకి దీదీ లేఖ

By

Published : Apr 7, 2019, 1:05 AM IST

Updated : Apr 7, 2019, 2:09 AM IST

పశ్చిమ్​ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల సంఘానికి లేఖ ద్వారా ప్రశ్నలు సంధించారు. తమ రాష్ట్రంలోని పోలీసు ఉన్నతాధికారుల బదిలీలు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఐపీఎస్​లను బదిలీ చేసేందుకు శాంతి, భద్రతల సమస్య ఏమైనా తలెత్తిందా అనిప్రశ్నించారు. ఎవరి ఆదేశాల మేరకు అధికారుల బదిలీలు చేపట్టారన్నారు.

"దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఈసీ తటస్థ వైఖరి అవలంబిస్తోందని నమ్మే వారిలో నేను ఒకరిని. కానీ ఈసీ ప్రస్తుత నిర్ణయం దురదృష్టకరం. ఏప్రిల్ 5, 2019 నాటి బదిలీలపై ప్రశ్నించేందుకే లేఖ రాస్తున్నా" -మమతా బెనర్జీ, పశ్చిమ్​ బంగ ముఖ్యమంత్రి

పశ్చిమ్​ బంగలో శాంతి భద్రతల పరిస్థితి సరిగా లేదని మోదీ ఆరోపించగానే బదిలీ ఉత్తర్వులు వచ్చాయన్నారు మమత. సార్వత్రిక ఎన్నికల పోలింగ్​ గడువు దగ్గరపడుతున్న తరుణంలో కోల్​కతా పోలీసు కమిషనర్ అనూజ్​ శర్మ, బిదాన్​ నగర్​ కమిషనర్ జ్ఞాన్వంత్ సింగ్లా బదిలీలు సంచలనం సృష్టించాయి. కాలుష్య నియంత్రణ బోర్డు డైరెక్టర్​గా వ్యవహరిస్తోన్న రాజేశ్​కుమార్​ను కోల్​కతాకు, ఐజీపీ ఆపరేషన్స్​గా ఉన్న నటరాజన్​ రమేశ్​బాబును బిదాన్​ నగర్​​కు కమిషనర్లు​గా ఈసీ బదిలీ చేసింది.

బిదాన్​ నగర్​ డిప్యూటీ కమిషనర్​గా పనిచేస్తున్న అవన్ను రవీంద్రనాథ్​ను బీర్​బమ్​ సూపరింటెండెంట్​గా, కోల్​కతా డిప్యూటి కమిషనర్ శ్రీహరి పాండేను డైమండ్ హార్బర్ పోలీస్​ సూపరింటెండెంట్​గా ఈసీ బదిలీ చేసింది.

ఈ అధికారులతో ఎన్నికలు పారదర్శకంగా జరగడం అసాధ్యమని ప్రతిపక్షాలు ఆరోపించిన అనంతరమే నిర్ణయం తీసుకుంది ఈసీ. భాజపాను సంతృప్తిపరిచేందుకే ఈసీ బదిలీల నిర్ణయం తీసుకున్నట్లుందని తన లేఖలో ఆరోపించారు మమత. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల పరిశీలకులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులను బదిలీ చేయడం సరికాదని పేర్కొన్నారు.

రాజీవ్​కుమార్​పై విచారణకు సుప్రీంకు సీబీఐ

శారదా కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న కోల్​కతా మాజీ పోలీసు కమిషనర్​ రాజీవ్​ కుమార్​ను బలవంతంగా విచారించకూడదన్న నిబంధనను తొలగించాలని సుప్రీంను ఆశ్రయించనుంది సీబీఐ. బలవంతపు చర్య చేపట్టకూడదన్న రక్షణ కంటే కేసులో పురోగతి సాధించడం అతి ముఖ్యమని సీబీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. విచారణకు ఆటంకంగా ఉన్న రక్షణలను తొలగించేందుకు కోర్టులో అప్పీల్ చేస్తామని చెప్పారు. రాజీవ్​ కుమార్​ను తమ కస్టడీకి అప్పగించాలని కోరతామన్నారు.

పోలీసు కమిషనర్​గా ఉన్న రాజీవ్​ కుమార్​ను విచారించేందుకు సీబీఐ అధికారులు ఫిబ్రవరి 3న కోల్​కతా వెళ్లారు. ఆయన నివాసం బయటే సీబీఐ అధికారులను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ ఘటన నగర నడిబొడ్డున ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధర్నా చేసేందుకు దారి తీసింది.

Last Updated : Apr 7, 2019, 2:09 AM IST

ABOUT THE AUTHOR

...view details