బంగాల్‌ను గుజరాత్‌లా మార్చాలని భాజపా కుట్ర పన్నుతోందని ఆరోపించారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అలా ఎప్పటికీ జరగనివ్వనని తేల్చిచెప్పారు. అవసరమైతే జైలుకెనా వెళ్తానని స్పష్టంచేశారు.
కోల్‌కతాలో భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల ర్యాలీ సందర్భంగా జరిగిన అల్లర్లలో ధ్వంసమైన సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని పునఃస్థాపించారు మమత. విద్యాసాగర్ కళాశాలలో పూర్వం ఉన్నటువంటి విగ్రహంతోపాటు 8 అడుగుల 5 అంగుళాల ప్రతిమను విద్యాసంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.
రాష్ట్రాల మనోభావాలతో భాజపా ఆడుకుంటోందని ఆరోపించారు మమత.
"మేం అందరినీ గౌరవిస్తాం. బంగాలీ ఆత్మగౌరవాన్ని ఎవరూ దెబ్బతీయకూడదు. భారత్‌లో ప్రతి రాష్ట్రం తమదైన చరిత్ర, భాష, ప్రాథమ్యాలు కలిగి ఉంది. ఐక్యమత్యంతో ఉన్న అతిపెద్ద దేశం భారత్. ఇక్కడ చాలా రకాల భాషలు, విధానాలు ఉన్నాయి. అందుకే మనం సారే జహాసే అచ్చా అని అంటుంటాం. కానీ భాజపా... రాష్ట్రాల భవిష్యత్‌ను నిర్ణయించాలనుకోవడం సరికాదు. ప్రతి రాష్ట్రానికి ఆత్మగౌరవం ఉంటుంది."