బుధవారం జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీదీ స్వయంగా మోదీ అపాయింట్మెంట్ కోరడం.. అనేక ఉహాగాలకు తెరలేపింది. తాజాగా ఈ విషయంపై స్పందించిన మమత.. మోదీతో తన సమావేశం మర్యాదపూర్వకమైనదేనని తెలిపారు. బాంగాల్లో నెలకొన్న సమస్యలే అజెండాగా భేటీ జరగనుందని మమత స్పష్టం చేశారు. నిధుల కేటాయింపు, రాష్ట్రానికి పేరుమార్చే అంశం, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం వంటి అంశాలను ప్రధానంగా మోదీ వద్ద ప్రస్తావించనున్నట్లు తెలిపారు. మంగళవారం దిల్లీకి బయలుదేరే ముందు విలేకరులతో జరిగిన సంభాషణలో మమత ఈ విషయాలను వెల్లడించారు.
"చాలా అరుదుగా దిల్లీ వెళ్తుంటాను. మరో చోటుకు వెళ్లకపోవడానికి రాష్ట్రంలోని బాధ్యతలే కారణం. పాలనపరమైన అంశాల కోసమే దిల్లీ వెళ్తుంటాం. అక్కడ పార్లమెంట్, రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఉండటం వల్ల వెళ్లక తప్పదు. ఇది(మోదీతో సమావేశం) సాధారణమైనదే."
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి