చిన్న చిన్న నదులు దాటేందుకు కాంక్రీటు వంతెనలే కావాలా? వందల ఏళ్ల క్రితం ఇంతటి సాంకేతికత లేనప్పుడు ప్రజలు నదులు దాటనే లేదా? అందుకే... పూర్వకాలంలో నదిని దాటేందుకు ఉపయోగించిన వెదురు వంతెనలను పునర్ నిర్మిస్తున్నాడు కర్ణాటక ఉడుపి జిల్లాకు చెందిన పురుషోత్తం ఆద్వే. అవసరమైన గ్రామాల్లో కొత్త వంతెనలు కట్టేసి ప్రకృతి పట్ల ప్రేమను చాటుతున్నాడు.
స్మార్ట్ సిటీ బెంగళూరు రాజధానిగా ఉన్నప్పటికీ కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికీ ఎన్నో గ్రామాలకు రోడ్డు మార్గం లేదు. ఇక వర్షాకాలంలో నదీ తీరాన ఉండే గ్రామస్థులు పట్నానికి వెళ్లాలంటే మెడలోతు నీటిలో నానా తంటాలు పడాల్సిందే. కాకర్ల తాలూకా, మన్నపాపు గ్రామంలోనూ ఇదే పరిస్థితి. ఈ ఊరిలో బడిపిల్లలు నదిని దాటి పాఠశాలలకు వెళ్లడం పెద్ద సవాలు.