తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నమో ప్రభంజనం... ఎన్డీఏ ఘన విజయం - ఫలితాలు

ఫిర్​ ఏక్​ బార్​ మోదీ సర్కార్​... 2019 ఎన్నికల భాజపా ప్రచార నినాదం. దీన్ని నిజం చేస్తూ అఖండ విజయాన్ని సాధించింది జాతీయ ప్రజాస్వామ్య కూటమి. ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలకు మించి రాణించింది. 542 లోక్​సభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 348 స్థానాలు సాధించింది. భాజపా సొంతంగానే మాజిక్ ఫిగర్​ 272ను దాటి 303 స్థానాలు సాధించింది.

నమో ప్రభంజనం... ఎన్డీఏ ఘన విజయం

By

Published : May 24, 2019, 6:16 AM IST

నమో ప్రభంజనం... ఎన్డీఏ ఘన విజయం

అవినీతి రహిత అభివృద్ధికి జనభారతం మళ్లీ జైకొట్టింది. నవభారత నిర్మాణ స్వాప్నికుడికి మరో ఐదేళ్లకు పాలనా పగ్గాలు అందించింది. భాజపా నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమికి ఘన విజయం అందించింది. 2014లో 336 స్థానాలు అందించిన ప్రజానీకం తాజా ఎన్నికల్లో 348 స్థానాలు కట్టబెట్టారు. యూపీఏ కూటమిని డబుల్​ డిజిట్​కే పరిమితం చేసింది. 86 స్థానాల్లోనే విజయం సాధించింది కాంగ్రెస్​ నేతృత్వంలోని యూపీఏ.

'మార్పు'పై భారీ ఆశలు పెట్టుకున్న విపక్ష జట్టుకు తీవ్ర నిరాశ మిగిలింది. మోదీని ఎదుర్కోవడమే ఏకైక లక్ష్యంగా, సిద్ధాంతాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చిన ప్రతిపక్షాల కూటమిని ఓటరుగణం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. భారత ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించే మహా యజ్ఞాన్ని కొనసాగించే బాధ్యతను మరోమారు నరేంద్రుడికే అప్పగించింది.

నమోనే సమస్తం...

భాజపా అపూర్వ విజయానికి కారణం ఒకే ఒక వ్యక్తి. ఆయనే నరేంద్ర మోదీ. భారత ప్రధానమంత్రి. 2014 సాధారణ ఎన్నికల్లోనూ భాజపాకు అన్నీ ఆయనే. పదేళ్లుగా అధికారంలో ఉన్న యూపీఏను చిత్తు చేశారు.

ఇప్పుడు 2019 సార్వత్రికంలోనూ అన్నీతానై ఎన్డీఏను విజయతీరాలకు చేర్చారు మోదీ. ప్రత్యర్థులంతా ఏకమై ముప్పేట దాడికి దిగినా... దీటుగా తిప్పికొట్టారు. అభివృద్ధి, సంక్షేమ మంత్రాలతో ప్రజలకు మరింత చేరువయ్యారు. సరైన పాలన, సమర్థ నాయకత్వం అందించడం తనతోనే సాధ్యమన్న భరోసా కల్పించారు. మరో ఐదేళ్లు దేశానికి సేవ చేసే అవకాశం దక్కించుకున్నారు.

చాయ్​వాలా.. చౌకీదార్​....

చాయ్​వాలా, చౌకీదార్​... 2014, 19 ఎన్నికల ప్రచారంలో భాజపాకు ఇదే తేడా. మిగతాదంతా సేమ్​ టూ సేమ్​. అప్పట్లో చాయ్​వాలాగా చెప్పుకొని ఓట్లడిగిన నరేంద్ర మోదీ... 2019 ఎన్నికల ముందు 'చౌకీదార్'గా మారారు. ప్రతిపక్షాలు పదేపదే విమర్శించినా... ఈ పదాన్నే బలంగా మార్చుకున్నారు. ప్రతి బహిరంగ సభలోనూ 'చౌకీదార్​కు అవకాశం ఇవ్వండి.. ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటా' అంటూ ప్రజల్లో విశ్వాసం నింపారు.

ఎన్నికల ప్రచారాల్లోనూ దూకుడుగా వ్యవహరించారు. ఒక్కోరోజు అరడజను బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఎక్కడ చూసినా మోదీనే కనిపిస్తున్నారు అనేంత ఖ్యాతి సంపాదించారు. ఏ ర్యాలీలో చూసినా లక్షల్లో జనం... అదే భాజపా ప్రభంజనానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. ఎన్డీఏను విజయ తీరాలకు చేర్చింది.

అభివృద్ధి ఊసే లేదు... జాతీయవాదం చుట్టూనే...

2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో అభివృద్ధి మంత్రమే మోదీ ప్రధానాస్త్రం. భారత్​ను ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తామని ప్రజల్లో నమ్మకం కలిగించారు. యూపీఏ పదేళ్ల పాలనలో విసిగిన ఓటర్లు... మోదీ అభివృద్ధి మంత్రానికి ఆకర్షితులయ్యారు. అధికారం అప్పగించారు.

2014లో అధికారం చేపట్టిన తర్వాత ఐదేళ్లు దాదాపు ప్రగతి మంత్రం జపిస్తూనే ముందుకు సాగారు మోదీ. విద్యుదీకరణ, రహదారులు, ఇళ్లు, డిజిటల్​ భారత్​... ఇలా ఎన్డీఏ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వీలు చిక్కినప్పుడల్లా ప్రస్తావించారు. 2019 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్​ విడుదలకు ముందు లెక్క మారింది.

మోదీని ఎలాగైనా గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో విపక్షాలు ఏకమయ్యాయి. నిరుద్యోగం, రఫేల్​ ఒప్పందం వంటి అంశాలను ప్రధానాస్త్రాలుగా చేసుకుని అధికార పక్షంపై దాడి ప్రారంభించాయి. వెంటనే భాజపా అప్రమత్తమైంది. వ్యూహం మార్చింది. జాతీయ వాదం, దేశ భద్రత వంటి అంశాలను తెరమీదకు తెచ్చింది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం, జమ్ముకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్​ 370 రద్దు, దేశమంతా ఎన్​ఆర్​సీ అమలు వంటి హామీలను ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చింది. దేశ భద్రత విషయంలో రాజీలేని పాలన అందించడం భాజపాకు మాత్రమే సాధ్యమన్న భావన కలిగించి, ప్రజావిశ్వాసం నిలబెట్టుకోవడంలో సఫలమైంది కమలదళం.

పుల్వామానే ప్రధానంగా...

2019 ఫిబ్రవరి 14... జమ్ముకశ్మీర్​ పుల్వామాలో ఆత్మాహుతి దాడి. 40మందికిపైగా జవాన్ల బలి. ఇటీవలి కాలంలో మృతుల సంఖ్య పరంగా అత్యంత దారుణ ఘటన. ఆ దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్​ బాలాకోట్ ఉగ్ర శిబిరాలపై భారత్​ చేసిన ​ వైమానిక దాడి విజయవంతమైంది. సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు ప్రధాన ప్రచారాంశం అయింది.

ప్రతి సభలోనూ ఏదో ఒక సందర్భంలో జవాన్ల సాహసాన్ని కీర్తిస్తూ... దేశ భద్రత విషయంలో భాజపా సర్కారు విజయంగా అభివర్ణించేవారు మోదీ. అదే ప్రజల్లో మోదీ ప్రభుత్వంపై నమ్మకం కలిగించి.. తిరుగులేని విజయాన్ని అందించాయనడంలో సందేహం లేదు.

బలమైన నాయకత్వం... ప్రజల్లో విశ్వాసం

2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన అనంతరం... మోదీ సర్కార్​ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంది. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటు వాటిలో కొన్ని.

జీఎస్టీ, నోట్ల రద్దు వంటి నిర్ణయాలపై ప్రతిపక్షాలు, నిపుణుల నుంచి ప్రశ్నలెదురైనా దీటుగా స్పందించారు కమలనాథులు. సులభతర వాణిజ్య విధానంలో మెరుగవడం, ప్రపంచ దేశాలతో సఖ్యత, 2014 సార్వత్రికం అనంతరం జరిగిన అనేక ఎన్నికల్లో భాజపా విజయం, 20కి పైగా రాష్ట్రాల్లో అధికారం దక్కడం... మోదీ సమర్థ నాయకత్వానికి ప్రతీకగా నిలిచాయి. ప్రజల్లో భాజపాపై నమ్మకం పెరగడానికి మరింత ఉపకరించాయి.

ప్రధాని అభ్యర్థిపై ప్రతిపక్షాల్లో స్పష్టత లేమి..?

మోదీ నేతృత్వంలోని అధికార కూటమికి ఎన్నో సానుకూలాంశాలు. కానీ... విపక్ష జట్టుకు మాత్రం ఎన్నో ప్రతికూలాంశాలు. మరెన్నో సవాళ్లు. వాటిలో ప్రధానమైంది నాయకత్వ లేమి. రాష్ట్రాలవారీగా పొత్తులు, సీట్ల సర్దుబాటు మొదలు ప్రధాని అభ్యర్థిని ప్రకటించకపోవడం వరకు... అన్నింటా విపక్ష జట్టుకు సరైన నాయకుడు లేని లోటు స్పష్టంగా గోచరించింది. ఫలితంగా... భాజపాకు ప్రత్యామ్నాయంగా కనిపించడంలో కూటమి విఫలమైంది. ఇది కమలదళానికి కలిసొచ్చింది.

ABOUT THE AUTHOR

...view details