ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోయిన ఓ నేతను పదిమంది ముందు ఓ మహిళ నిలదీసిన ఘటన మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లా జౌల్ఖేరా గ్రామంలో జరిగింది.
కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి సుఖ్దేవ్ పాన్సే జౌల్ఖేరా గ్రామంలో జరిగిన ఓ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఆశ అనే మహిళ.. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చాలా వాగ్దానాలు చేసిందని, అయితే అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
"రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. 80 శాతం మంది మహిళలు సంతకాలు చేసిన గ్రామాల్లో మద్యపానం నిషేధిస్తామని కూడా వాగ్దానం చేసింది. అయితే ప్రభుత్వాన్ని ఏ పార్టీ ఏర్పాటుచేసినా.. నేతలు మాత్రం ప్రజలను తప్పుడు వాగ్దానాలతో మోసం చేస్తున్నారు." - ఆశ, జౌల్ఖేరా గ్రామ మహిళ
సమయం పడుతుంది..!
ఆశ ఆవేదన విన్న మంత్రి పాన్సే... పథకాలు అమలు చేయడానికి సమయం పడుతుందని, రుణాలు మాఫీ అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆమెకు హామీ ఇచ్చారు. అలాగే ఇప్పటివరకు రుణమాఫీ చేసిన రైతుల జాబితాను ఆశకు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.