దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. కేంద్ర వైద్య,ఆరోగ్యశాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా కేసులు 5,274కు చేరాయి. ఇప్పటివరకు 149 మంది ఈ మహమ్మారి బారినపడి మరణించారు. మొత్తం 410 మంది కోలుకుని.. ఇళ్లకు వెళ్లారు. వైరస్ కేసులు పెరుగుతున్నందున దిల్లీలో 20 హాట్‌స్పాట్ ప్రాంతాలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
రాజస్థాన్‌లో...
రాజస్థాన్‌లో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతోంది. బుధవారం ఒక్కరోజే 40 మందికి వైరస్ సోకింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 383 మంది మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో ఎక్కువ మందికి తబ్లీగీ జమాత్ ప్రార్థనల్లో పాల్గొన్న వారితో సంబంధాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
72కొత్త కేసులు నమోదు...
మధ్యప్రదేశ్‌లోనూ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. బుధవారం మరో 72 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్రవ్యాప్తంగా ఇప్పటివరకు 385మంది వైరస్ బారిన పడ్డారు. రాష్ట్రంలో వాణిజ్య నగరమైన ఇండోర్‌లో అధికంగా 213 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 29మంది వైరస్‌కు బలయ్యారు.
426 మంది వారే..
దేశ రాజధానిలో ఒక్కరోజులో ఎకంగా 93 కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం నాటికి దిల్లీలో వైరస్ సోకిన వారి సంఖ్య 669కి చేరింది. వీరిలో 426 మంది తబ్లీగీ జమాత్ ప్రార్థనల్లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన సుమారు 2,500మందిని క్వారంటైన్లో ఉంచినట్లు పేర్కొన్నారు.