విపక్షాలపై స్పీకర్ అసహనం.. లోక్‌సభ రేపటికి వాయిదా దిల్లీ అల్లర్లపై పార్లమెంట్ దద్దరిల్లింది. ఉభయసభల వేదికగా ఘర్షణలపై చర్చకు పట్టుబట్టాయి విపక్షాలు. లోక్‌సభలో విపక్ష సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. సభా మర్యాదను కాపాడాలని సూచించారు.
తొలుత ఎంపీ వైద్యనాథ్ ప్రసాద్ మహతో మృతికి సంతాపంగా రెండు గంటల వరకు మొదటిసారి వాయిదా పడింది లోక్‌సభ. అనంతరం సభ కార్యకలాపాలు పునః ప్రారంభమైనప్పటికీ గందరగోళం కొనసాగింది. ఆందోళనల మధ్యే.. సీఏఏ అంశమై విపక్ష సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి. 1984లో 3వేలమంది ఊచకోతపై ఎలాంటి చర్యలు తీసుకోని వారు.. ప్రస్తుతం గందరగోళం సృష్టిస్తున్నారని కాంగ్రెస్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
తోపులాట...
ఆందోళన కొనసాగించిన విపక్ష సభ్యులు.. హోంమంత్రి అమిత్‌షా రాజీనామాకు డిమాండ్ చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌కు రక్షణగా వెల్‌లోకి వచ్చారు భాజపా సభ్యులు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఫలితంగా.. మూడు గంటల వరకు వాయిదా(రెండోసారి) పడింది లోక్‌సభ.
సభ కార్యకలాపాలు పునఃప్రారంభమైనా ఫలితం మాత్రం శూన్యం. దిల్లీ ఘర్షణలపై విపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో ప్యానెల్ స్పీకర్ రమాదేవి సాయంత్రం నాలుగు గంటల వరకు సభను వాయిదా వేశారు. నాలుగు గంటల తర్వాత కూడా సభ మరోమారు వాయిదా పడింది. 4:30 గంటలకు తిరిగి సమావేశమైన అనంతరం తోపులాటపై విచారం వ్యక్తం చేశారు స్పీకర్ ఓం బిర్లా. లోక్‌సభ మర్యాదను కాపాడాలని ఉద్ఘాటించారు. సభా నియమావళి మేరకు నడుచుకుని.. భారత ప్రజాస్వామ్య గౌరవాన్ని పెంచాలని వ్యాఖ్యానించారు.
దిల్లీ అల్లర్లపై విపక్షాల నిరసన మధ్య రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది.
ఇదీ చూడండి: నిర్భయ దోషుల ఉరిపై వీడని ఉత్కంఠ.. మరోమారు స్టే