తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిధుల కొరతతో లోక్​ అదాలత్​ సేవలు సతమతం - న్యాయమూర్తుల కొరత

ప్రజలకు సత్వర న్యాయం అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్ వ్యవస్థ నిధులలేమి, న్యాయమూర్తుల కొరత, ఇతర సమస్యలతో సతమతమవుతోంది.లోక్ అదాలత్ వ్యవస్థ నిధుల కొరతతో సేవలకు పరిమితులు ఏర్పడుతున్నాయి. బడ్జెట్ పెంపుపై ప్రభుత్వాలు ఆలోచించాలి. వ్యాజ్యాల పరిష్కారంలో కీలకపాత్ర పోషించే న్యాయమూర్తుల కొరత కొట్టొచ్చినట్లు కనబడుతోంది. న్యాయమూర్తులతోపాటు లోక్ అదాలత్​ల సంఖ్యనూ పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది.

నిధుల కొరతతో లోక్​ అదాలత్​ సేవలు సతమతం

By

Published : Sep 14, 2019, 4:32 PM IST

Updated : Sep 30, 2019, 2:28 PM IST

ప్రజలకు సత్వర న్యాయం అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్ వ్యవస్థ అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. నిధులలేమి, న్యాయమూర్తుల కొరత, మౌలిక సౌకర్యాల లోపాలతో సతమతమవుతోంది. ఫలితంగా కక్షిదారులకు సత్వర న్యాయం అందించడంలో వెనకబడుతోంది. అయినప్పటికీ ఉన్న కొద్దిపాటి వనరులు, సౌకర్యాలతోనే ముందుకు సాగుతోంది. లోక్ అదాలత్ వ్యవస్థ నిరుడు దేశవ్యాప్తంగా కేవలం రూ.80 కోట్లతోనే కార్యకలాపాలు చేపట్టింది. నిధుల కొరతతో సేవలకు పరిమితులు ఏర్పడుతున్నాయి. బడ్జెట్ పెంపుపై ప్రభుత్వాలు ఆలోచించాలి. వ్యాజ్యాల పరిష్కారంలో కీలకపాత్ర పోషించే న్యాయమూర్తుల కొరత కొట్టొచ్చినట్లు కనబడుతోంది. న్యాయమూర్తులతోపాటు లోక్ అదాలత్ల సంఖ్యనూ పెంచాల్సిన అవసరం ఉంది.

న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు ఏటికేడు పెచ్చరిల్లుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని స్థాయుల్లో ప్రతిరోజూ పెద్దసంఖ్యలో కొత్త వ్యాజ్యాలు నమోదవుతున్నాయి. వీటి పరిష్కారానికి ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. తరచూ వాయిదాలతో కక్షిదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా న్యాయసేవలు అందించాలన్న ప్రతిపాదన మొగ్గతొడిగింది. ఫలితంగా న్యాయసేవల అధికార చట్టం రూపుదిద్దుకొంది. దీని ద్వారా ఏర్పాటైన లోక్ అదాలత్ లు పేదవర్గాల ప్రజలకు న్యాయసేవలు అందిస్తూ వ్యాజ్యాల పరిష్కారానికి దోహదపడుతున్నాయి.

ప్రపంచంలో మొట్టమొదటిసారి న్యాయ సహాయ కార్యక్రమం ఫ్రాన్స్​లో ప్రారంభమైంది. ఈ మేరకు 1851లో చట్టం తీసుకువచ్చారు. బ్రిటన్​లో 1944 నుంచి ఈ తరహా సేవలు అందిస్తున్నారు. ఈ విషయమై 1952లో భారత్​లో సమాలోచనలు మొదలయ్యాయి. గుజరాత్​లో తొలుత ప్రయోగాత్మకంగా లోక్ అదాలత్ వ్యవస్థ ప్రారంభమైంది. 1980లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎన్.భగవతి అధ్యక్షతన దేశవ్యాప్తంగా న్యాయసేవల కార్యక్రమాలు పర్యవేక్షించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేశారు. న్యాయసహాయ పథకాల కమిటీగా దాన్ని గుర్తిస్తూ దేశవ్యాప్తంగా కార్యకలాపాలు ప్రారంభించారు. లోక్ అదాలత్​ల ఏర్పాటుతో న్యాయవ్యవస్థ ఒక నూతన అధ్యాయానికి తెరతీసిందని చెప్పవచ్చు. 1998 ఫిబ్రవరి నుంచి న్యాయసేవా కార్యక్రమాలు విస్తృతం చేశారు. ప్రస్తుతం దేశంలో జాతీయ న్యాయసేవా సంస్థ, సుప్రీంకోర్టు న్యాయసేవా కమిటీ, రాష్ట్రాల న్యాయ సేవా సంస్థలు, హైకోర్టు న్యాయసేవా కమిటీలు, జిల్లా న్యాయ సేవా సంస్థలు, తాలూకా న్యాయ సేవా కమిటీల ఆధ్వర్యంలో సేవలు పేదప్రజలకు అందుతున్నాయి. జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఫిబ్రవరి 2017 నుంచి జులై 2019 మధ్యకాలంలో 1.39 కోట్ల కేసులు కొలిక్కివచ్చాయి

సామరస్యపూర్వకంగా వ్యాజ్యాల పరిష్కారానికి రూపొందించిన వ్యవస్థే- లోక్ అదాలత్. ఇవి ఇచ్చే తీర్పులకు చట్టబద్ధత ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీన్ని ఆమోదించాల్సిందే. 2017-19 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్​లో 2.93 లక్షలు, తెలంగాణలో 3.33 లక్షల కేసులు పరిష్కారమయ్యాయి. గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్​లో 19,290, తెలంగాణలో 6,799 న్యాయ అవగాహన సదస్సులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్​లో 18,163 మంది, తెలంగాణలో 30,067 మంది న్యాయ సహాయం పొందారు. ఇతర రాష్ట్రాలతో పోల్చిచూసినప్పుడు లోక్ అదాలత్​లకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయి.

నిధులు, న్యాయమూర్తుల కొరత, మౌలిక సౌకర్యాల లేమి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ లోక్ అదాలత్ వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యానికి కృషి చేస్తోంది. చట్టాల పట్ల అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తోంది. వారికి న్యాయపరంగా అండగా నిలుస్తోంది. ఏప్రిల్ 2017 నుంచి మార్చి 2019 నాటికి దేశవ్యాప్తంగా 92,088 న్యాయ సదస్సులు నిర్వహించగా సుమారు 4.13 కోట్ల ప్రజలకు వివిధ చట్టాల పట్ల అవగాహన కల్పించింది. న్యాయపరంగా చిక్కులు ఎదుర్కొంటున్న ప్రజలను గుర్తించి వారికి న్యాయసేవలు ఉచితంగా అందిస్తూ వ్యాజ్యాల పరిష్కారానికి బాటలు వేస్తోంది.

లోక్ అదాలత్ల ఆధ్వర్యంలో న్యాయసేవా క్లినిక్లు పనిచేస్తున్నాయి. ఇవి ప్రజలకు చేరువవుతున్నాయి. వారంలో మూడు నుంచి అయిదు రోజులపాటు న్యాయవాదులు, న్యాయసేవా వాలంటీర్లు క్లినిక్లలో కక్షిదారులకు అందుబాటులో ఉంటారు. ఇవి ప్రధానంగా గ్రామాల్లో సేవలు అందిస్తున్నాయి. వీటి ద్వారా గత రెండేళ్లలో 14.3 లక్షల మందికి న్యాయసేవలు అందించారు. గత ఏడాదిలో జైల్లో శిక్ష అనుభవిస్తున్న మహిళలకు సైతం చట్టాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. సుమారు 1.47 లక్షల మంది మహిళా ఖైదీలను కలిసి 2,088 న్యాయ అవగాహన సదస్సులు నిర్వహించారు. 2,942 మందికి న్యాయసహాయం అందించి వారి విడుదలకు దోహదపడ్డారు. ప్రజలను చట్టాల పట్ల చైతన్యవంతులను చేయడానికి విద్యార్థి దశ నుంచే వారికి అవగాహన కలిగించేలా అధికారులు చర్యలు ప్రారంభించారు. గత ఏడాదిలో లీగల్ లిటరరీ క్లబ్లను 4,328 ప్రాంతాల్లో ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. వాలంటీర్ల ఆధ్వర్యంలో చట్టాల పట్ల విద్యార్థులను జాగృతం చేస్తున్నారు.

జాతీయ లోక్ అదాలత్​లతో పాటు రాష్ట్ర పరిధిలో శాశ్వత లోక్ అదాలత్ల ద్వారా అనేక కేసులు పరిష్కారానికి నోచుకుంటున్నాయి. 2016-19 మధ్యకాలంలో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్​ల ద్వారా 3.43 లక్షల కేసులు అధికారుల దృష్టికి రాగా వాటిలో అత్యధికంగా 93.2 శాతం పరిష్కారమయ్యాయి. లోక్ అదాలత్​లకు నిధుల కేటాయింపు పెంచడంతోపాటు మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. అప్పుడే అవి మరింత సమర్థంగా సేవలు అందించగలవు!
- డాక్టర్ సిలువేరు హరినాథ్(రచయిత- సెస్ లో రీసెర్చ్ అసిస్టెంట్)

ఇదీ చూడండి:'రూపాయి ఇడ్లీ' బామ్మ పరుగు పందెంలోనూ టాప్​!

Last Updated : Sep 30, 2019, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details