ప్రకృతి వైపరీత్యాలు దేశంలోని పలు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే అసోం, బిహార్, మేఘాలయ రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో కేరళ చిగురుటాకులా వణికిపోతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో కురిసిన పిడుగులు పలువురి మృతికి కారణమయ్యాయి.
పిడుగుల వల్ల 32 మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఆదివారం వచ్చిన పిడుగుల ధాటికి 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ విషాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆధికారులను ఆదేశించారు.
ప్రాణాలు పోతూనే ఉన్నాయ్...
వరదల విలయంలో చిక్కుకున్న బిహార్, అసోం రాష్ట్రాల్లో మృతుల సంఖ్య 166కు చేరుకుంది. అసోంలో 64, బిహార్‌లో 102 మంది మరణించారు. వరదలు తగ్గుముఖం పట్టినా...బిహార్‌లో 12 జిల్లాలు, అసోంలో 18 జిల్లాలు ఇంకా నీటమునిగే ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో మొత్తంగా 1.11 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు.
సీతామర్హి, దర్బాంగా జిల్లాల్లోని పునరావాస కేంద్రాలను బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సందర్శించి బాధితులను పరామర్శించారు.