హాథ్రస్ అత్యాచార కేసును పర్యవేక్షించే బాధ్యతను అలహాబాద్ హైకోర్టుకే అప్పజెప్పింది సర్వోన్నత న్యాయస్థానం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సరైన రీతిలో దర్యాప్తు చేయించడం లేదంటూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు.
అలహాబాద్ హైకోర్టు ఈ కేసును పర్యవేక్షించాలని.. ఒకవేళ ఏదైనా సమస్య ఏర్పడితే పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఓ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించేందుకు పలువురు న్యాయవాదులు ప్రయత్నించారు. విచారణను ఉత్తర్ప్రదేశ్ నుంచి తరలించాలని బాధితురాలి తరఫు న్యాయవాదితో పాటు మరికొందరు అభ్యర్థించారు. అయితే.. యావత్ ప్రపంచం తరలివచ్చి తమకు సహకారం అందించాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తంచేయగా వారు వెనుదిరిగారు.
మరోవైపు.. బాధితురాలి వివరాలను ఎక్కడా బయటపెట్టకూడదని.. ఆమె కుటుంబ సభ్యులు, సాక్షులకు భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:-చక్రవడ్డీ మాఫీలో జాప్యంపై సుప్రీం అసంతృప్తి