దేశ సేవలో ప్రాణాలు కోల్పోవడం.. సైనికులకు గర్వకారణం. కానీ వారి కుటుంబ సభ్యులది వేరే కథ. దేశం కోసం ప్రాణాలు వదిలారని గర్వపడినా.. తమని విడిచి వెళ్లిపోయారనే దుఃఖంలో ఎన్నో ఏళ్లు గడుపుతారు కుటుంబ సభ్యులు. తాజాగా గాల్వన్ లోయలో అమరుడైన కుందన్ కుమార్ కుటుంబసభ్యుల పరిస్థితి కూడా ఇదే. అయితే.. ఇటీవలే జన్మించిన తన కుమార్తెను కుందన్ చూడకుండానే మరణించడం అత్యంత విషాదకరమైన వార్త.
ఇచ్చిన హామీ నెరవేర్చకుండానే...
కుందన్ కుమార్ ఓజా... ఝార్ఖండ్‌లోని దిహారీ గ్రామవాసులు రవి శంకర్ ఓజా, భవానీ దేవీ రెండో కుమారుడు. చిన్న నాటి నుంచి కుందన్‌కు భారత సైన్యం అంటే ప్రేమ. ఆర్మీ దుస్తుల్లో దేశానికి ఎప్పటికైనా సేవ చేయాలని కలలు కనేవారు. ప్రతి రోజు తెల్లవారుజామున 3 గంటలకు లేచి వ్యాయామాలు చేసేవారు. తన కలను నెరవేర్చుకుని 2011లో ఆర్మీలో చేరారు.