కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి కుమారస్వామి రాజీనామా చేశారు.గవర్నర్ వాజూభాయి వాలాను కలిసి రాజీనామా సమర్పించారు. శాసనసభలో జరిగిన బలపరీక్షలో ఓటమి అనంతంరం గవర్నర్ సమయాన్ని కోరిన కుమారస్వామి రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌తో సమావేశమయ్యారు. బలపరీక్షలో ఓటమి కారణంగా రాజీనామా చేస్తున్నట్లు లేఖ సమర్పించారు. రాజీనామాను ఆమోదించిన గవర్నర్ నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కుమారస్వామిని కోరారు.
13నెలలకే...
కర్ణాటక శాసనసభలో మొత్తం సీట్ల సంఖ్య 224. అధికారంలో ఉండాలంటే కనీసం 113 మంది సభ్యుల బలం అవసరం.
78 మంది సభ్యులున్న కాంగ్రెస్, 37 మంది ఎమ్మెల్యేలున్న జేడీఎస్, ఒక సభ్యుడున్న బీఎస్పీ, ఇద్దరు స్వతంత్రులతో కుమారస్వామి నేతృత్వంలో గతేడాది సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆరంభంలో అధికార పక్ష బలం 118. భాజపాకు 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.కాంగ్రెస్-జేడీఎస్ కూటమిలో సంక్షోభం జులై 6న మొదలైంది. రెండు పార్టీలకు చెందిన 16 మంది శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్ కార్యాలయానికి వెళ్లి లేఖలు సమర్పించారు.
సంకీర్ణ కూటమిలో భాగస్వాములైన ఇద్దరు స్వతంత్రులు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. భాజపా పక్షాన చేరారు.