2024 నాటికి భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం సవాలే అయినా... ఆచరణ సాధ్యమేనని ధీమా వ్యక్తంచేశారు ప్రధాని నరేంద్రమోదీ. ఇందుకోసం రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
దిల్లీలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ప్రసంగించారు మోదీ. 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్' మంత్రాన్ని సంపూర్ణం చేసేందుకు నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. పేదరికం, నిరుద్యోగం, అవినీతిపై అందరూ సమష్టిగా పోరాడాలని ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు మోదీ.
"ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల హడావుడి ముగిసింది. దేశాభివృద్ధి కోసం పని చేసే సమయం ఇది. అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు సాగి సమస్యలను అధిగమించాలి."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఆదాయం, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడానికి ఎగుమతుల రంగం ఎంతో ఉపయోగపడుతుందన్నారు ప్రధాని. అన్ని రాష్ట్రాలు ఈ అంశంపై దృష్టి సారించాలని సూచించారు.