సాధారణంగా కేశాలు తలపై ఉంటే సౌందర్యాన్ని పెంచుతాయి.. శరీరం నిండా ఉంటే చికాకును తెప్పిస్తాయి. కానీ, కేరళ త్రివేండ్రంలో స్టీఫెన్ నోటిలో పెరిగిన అవాంఛిత రోమాలు అతడిని భరించలేని వేదనకు గురిచేస్తున్నాయి.
'శస్త్ర చికిత్స చేశాకే.. నోటి నిండా వెంట్రుకలు పెరిగాయి!' వైద్యుల నిర్వాకం...
కొన్ని రోజుల క్రితం స్టీఫెన్‌కు నోటి కేన్సర్ సోకింది. చికిత్స కోసం త్రివేండ్రంలోని ఆర్సీసీ ఆసుపత్రికి వెళ్లాడు. శస్త్రచికిత్స ద్వారా నోటిలోని కేన్సర్ భాగాలను తొలగించారు వైద్యులు. ఆ భాగంలో తొడ భాగం నుంచి తీసిన చర్మాన్ని అతికిస్తామని చెప్పి.. స్టీఫెన్ గడ్డం (దవడ) భాగం నుంచి తీసిన చర్మాన్ని అంటుకట్టారు. ఆ తర్వాతే నోటిలో రోమాలు పెరిగే ఇబ్బంది మొదలైందని వాపోతున్నాడు స్టీఫెన్.
డాక్టర్ గారి 'బార్బర్' సలహా
కొబ్బరి చెట్లెక్కే కూలీ పనికి వెళితే గానీ స్టీఫెన్ బతుకు బండి నడవదు. కానీ, ఈ రోమాల కారణంగా అన్నం తినక, కనీసం నీరు తాగలేకపోవడం వల్ల చెట్లెక్కేందుకు శక్తి సరిపోవట్లేదు. అంతేకాదు.. నిత్యం నోట్లో అడ్డుగా తగులుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి రోమాలు.
ఇదేంటయ్యా అంటూ శస్త్ర చికిత్స చేసిన వైద్యుల దగ్గరికెళ్లాడు స్టీఫెన్. 'నోట్లో వెంట్రుకలు పెరిగితే కత్తిరించుకో లేదా క్షురకుడి దగ్గరికెళ్లి క్షవరం చేయించుకో' అంటూ ఓ డాక్టర్ ఇచ్చిన సలహా విని గుండెలు పగిలేలా ఏడ్చాడు స్టీఫెన్.
వైద్యుల నిర్లక్ష్యంతో తీవ్ర వేదనకు గురయ్యాడు. వింత సమస్యకు పరిష్కారం తెలియక అయోమయంలో మునిగిపోయాడు.
ఇదీ చదవండి:పెళ్లి నుంచి పారిపోయిన వరుడు.. కారణమిదే!