తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​: ముష్కరుల పాపం... ఉపాధికి శాపం

ఆయుధాల మోతతో గత 20 ఏళ్లుగా నిత్యం సమస్యల్ని ఎదుర్కొంటున్న కశ్మీర్​లోయ తుపాకీ సంస్కృతికి క్రమంగా దూరంగా జరుగుతోందా... పరిస్థితులు చూస్తే నిజమేనని అనిపిస్తోంది. ప్రభుత్వ ఆంక్షలు ఓవైపు, నైపుణ్యం కలిగిన కార్మికులు వేరే ఉద్యోగాలకు వలస పోతుండటం మరోవైపు.. ఏదైతేనేం ఇలా ఆయుధ కర్మాగారాలు వెలవెలబోతున్నాయి.

కశ్మీర్ ఆయుధ ఫ్యాక్టరీల్లో తగ్గిన ఉత్పత్తి

By

Published : Apr 2, 2019, 8:32 AM IST

Updated : Apr 2, 2019, 8:42 AM IST

కశ్మీర్ ఆయుధ ఫ్యాక్టరీల్లో తగ్గిన ఉత్పత్తి
కశ్మీర్​లోయలో ఆయుధ వాడకం సర్వసాధారణం. తుపాకుల తయారీతో ఆయుధ కర్మాగారాలు కళకళలాడుతుండేవి. ప్రస్తుతం తయారీ లేక వెలవెలబోతున్నాయి. ఇటీవల వేరే వృత్తుల్లో నైపుణ్యాల పెంపు దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. కారణంగా తుపాకుల తయారీ తిరోగమనం వైపు పయనిస్తోంది.

ఆంక్షల కారణంగా...

కశ్మీర్ పౌరులు ఆయుధాల్ని కొనే విషయమై 1947 నుంచి ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పెరిగిన నిఘా వల్లా ఆయుధాలు కొనేందుకు జంకుతున్నారు. 1947కు పూర్వం శ్రీనగర్​లో 20 ఆయుధ కర్మాగారాలుండేవి. ప్రస్తుతం అవి రెండుకు తగ్గాయి. సుభానా అండ్ సన్స్, జరూ గన్ ఫ్యాక్టరీలు 12బోర్, సింగిల్, డబుల్ బ్యారెల్ తుపాకుల్ని ఉత్పత్తి చేస్తున్నాయి.

కోటా మేరకే తయారీ...

1989లో కశ్మీర్​లోయలో ఉగ్రవాదం పెచ్చుమీరింది. ఫ్యాక్టరీల ద్వారా లభ్యమయ్యే తుపాకులు ఉగ్రమూకల చేతిలో పడకుండా కర్మాగారాల్ని మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్ల అనంతరం నిర్దేశించిన కోటా మేరకే ఆయుధాలు తయారు చేయవచ్చని అనుమతులిచ్చింది.

వేరే వృత్తులకు నిపుణుల వలస

ఆయుధ తయారీ నైపుణ్యం కలిగిన కశ్మీరీ తయారీదారులు వేరే ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. మరో పని రాని వృద్ధులు మాత్రమే ప్రస్తుతం ఈ పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఇలా అవసరమైన నిపుణులు లేక పరిశ్రమ కుంటినడకన నడుస్తోంది.

ఆధునికతకు ఆమడ దూరం

ప్రస్తుతం ఆయుధ తయారీలో ఉన్న ఫ్యాక్టరీలు ఆధునికత వైపు అడుగులు వేయడానికి జంకుతున్నాయి. అనేక అనుమతులు తీసుకోవాల్సి రావడం, ప్రస్తుతమున్న లైసెన్సులూ కోల్పోయే అవకాశం కారణంగా పరిశ్రమను ఆధునికీకరించేందుకు కర్మాగారాలు సుముఖంగా లేవు.

భద్రత, క్రీడల్లో వినియోగం

ప్రస్తుతం తయారవుతున్న 12 బోర్ సింగిల్, డబుల్ బ్యారెల్ తుపాకులు ఎక్కువగా క్రీడల్లో వినియోగిస్తుంటారు. సెక్యూరిటీ గార్డులూ వీటిని వాడుతుంటారు. కేంద్ర సంస్థలూ కొనుగోలు చేస్తుంటాయి. కశ్మీర్​లో ఆయుధాలపై అప్రకటిత ఆంక్షలు కొనసాగుతుండటం, వేటపై నిషేధం ఉండటం కారణంగా కశ్మీర్​లో సాధారణ ప్రజలు ఆయుధాల్ని వినియోగించేందుకు సుముఖంగా లేరు.

ప్రస్తుతం తయారీలో ఉన్న రెండు సంస్థలు సైతం పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరికొన్నేళ్లలో పరిశ్రమను మూసివేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Last Updated : Apr 2, 2019, 8:42 AM IST

ABOUT THE AUTHOR

...view details