కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ రోజు రాత్రి నుంచి జనవరి 1 వరకు రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తామంటూ సీఎం యడియూరప్ప బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో రాత్రి 11గంటల నుంచి ఉదయం 5గంటల వరకు విధించిన కర్ఫ్యూ అమలులోకి రాకముందే నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం గమనార్హం. బ్రిటన్‌లో కొత్త వైరస్ ప్రబలడంతో దాని వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా నిపుణుల అభిప్రాయం ఆధారంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని తొలుత నిర్ణయించినట్టు సీఎం యడియూరప్ప ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా కర్ఫ్యూ అమలు చేయాల్సిన అవసరం లేదని భావించినట్టు తెలిపారు. అందుకే కేబినెట్ సహచరులు, సీనియర్ అధికారులతో చర్చించిన అనంతరం రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటనలో తెలిపారు.
మాస్క్‌లు ధరించి, భౌతికదూరం పాటించడం ద్వారా ఈ వైరస్ కట్టడికి ప్రజలు సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, ప్రభుత్వం విధించిన కొవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు.