14 తిరుగుబాటు ఎమ్మెల్యేలు బెంగళూరు నుంచి ముంబయికి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రమే 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి రాజీనామాలను సమర్పించారు.
కర్'నాటకీయం' లైవ్: తిరుగుబాటు ఎమ్మెల్యేలపై మండిపడ్డ స్పీకర్
23:43 July 11
ముంబయికి 14మంది ఎమ్మెల్యేలు...
19:32 July 11
'భూకంపం వచ్చినట్టు ప్రవర్తించారు'
తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేశ్ మండిపడ్డారు. తనను కలవకుండానే గవర్నర్‌తో సమావేశమయ్యారన్నారు. ఎమ్మెల్యేలు ముంబయికి వెళ్లడాన్ని తప్పుపట్టారు. తనను సంప్రదించుంటే రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసేవాడినన్నారు. రాజీనామాలు సమర్పించి మూడు పని దినాలే అయినప్పటికీ పెద్ద భూకంపం వచ్చినట్టు ప్రవర్తించారని విమర్శించారు రమేశ్.
19:20 July 11
'తొందరపాటు నిర్ణయం తీసుకోను'
ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారాన్ని పరిశీలించనున్నట్టు కర్ణాటక స్పీకర్ రమేశ్ ప్రకటించారు. తొందరపాటు నిర్ణయం తీసుకోనని వెల్లడించారు.
19:10 July 11
'రాజీనామాలపై ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయలేదు'
13 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం కర్ణాటక స్పీకర్ మీడియాతో మాట్లాడారు. రాజీనామాల వ్యవహారంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నానన్న ఆరోపణలను రమేశ్ కుమార్ ఖండించారు. ఆ వార్తలు ఎంతో బాధించాయన్నారు. ఎమ్మెల్యేలు వస్తున్నారని తెలిసి కార్యాలయం నుంచి వెళ్లిపోయానన్న మాట అవాస్తవమని వెల్లడించారు.
18:14 July 11
కర్ణాటక విధాన సౌధకు అసంతృప్త ఎమ్మెల్యేలు
కర్ణాటక అసంతృప్త ఎమ్మెల్యేలు బెంగళూరు విధాన సౌధకు చేరుకున్నారు. స్పీకర్ రమేశ్ కుమార్ కలిసి రాజీనామాలపై చర్చించనున్నారు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
17:45 July 11
బెంగళూరులో అసంతృప్త ఎమ్మెల్యేలు
అసంతృప్త ఎమ్మెల్యేలు ముంబయి నుంచి బెంగళూరు చేరుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్‌ను కలసి తాజాగా మరోసారి తమ రాజీనామాలు సమర్పించనున్నారు.
15:28 July 11
'సుప్రీం ఎఫెక్ట్': బెంగళూరుకు అసంతృప్త ఎమ్మెల్యేలు
సుప్రీంకోర్టు తీర్పుతో ముంబయిలో ఉన్న అసంతృప్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయల్దేరారు. స్పీకర్‌ను కలిసి తాజాగా మరోసారి రాజీనామాలు ఇవ్వనున్నట్లు సమాచారం. సుప్రీం ఆదేశాలతో స్పీకర్.. ఈ రోజే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
14:15 July 11
కర్'నాటకం': సుప్రీం కోర్టులో సభాపతికి చుక్కెదురు..
కర్ణాటక రాజకీయ సంక్షోభంలో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. 10 మంది అసంతృప్తి ఎమ్మెల్యేల రాజీనామాలపై ఈ రోజే నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పుబట్టారు సభాపతి. రాజీనామాలపై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత గడువు కావాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు స్పీకర్.
అయితే.. సభాపతి పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని స్పీకర్ తరఫున న్యాయవాది కోర్టును కోరారు. అయితే.. అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. శుక్రవారం రోజు.. అసంతృప్త ఎమ్మెల్యేల పిటిషన్‌తో కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టుకు ఆ హక్కు లేదు..
సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టారు కర్ణాటక అసెంబ్లీ సభాపతి. ఎమ్మెల్యేల రాజీనామాలకు కారణం తెలుసుకోవాల్సి ఉందని.. విచారించేందుకు సమయం పడుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈయన.. తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ఆదేశించడం సరికాదు. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటూ ఆదేశాలిచ్చే హక్కు సుప్రీంకోర్టుకు లేదు.
- అభిషేక్ మను సింఘ్వీ, స్పీకర్ తరఫు న్యాయవాది
13:43 July 11
నేనెందుకు రాజీనామా చేయాలి?: కుమార స్వామి
తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, ఎందుకు రాజీనామా చేయాలని మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి. 2009-10 సం.లో మంత్రులు సహా 18 మంది ఎమ్మెల్యేలు అప్పటి భాజపా ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా వ్యతిరేకించినా ఆయన రాజీనామా చేయలేదని గుర్తు చేశారు.
12:39 July 11
కర్'నాటకం': సుప్రీం తీర్పుతో కొలిక్కివచ్చేనా..?
అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాల అంశంపై సుప్రీం కోర్టు ఆదేశాలతో కర్ణాటక రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చే అవకాశముంది. 10 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలందరినీ.. కర్ణాటక వెళ్లి అసెంబ్లీ స్పీకర్‌ను కలవాలని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. వీరికి తగిన భద్రత కల్పించాలని కర్ణాటక డీజీపీని ఆదేశించింది. అదే విధంగా.. సభాపతిని రాజీనామాలపై ఈ రోజే నిర్ణయం తీసుకోవాలని.. రేపు కోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది. అనంతరం.. విచారణను రేపటికి వాయిదా వేసింది.
సుప్రీం ఆదేశాలతో.. ముంబయిలో మకాం వేసిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు నేడు మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరుకు బయల్దేరనున్నట్లు సమాచారం. రాజీనామాల అంశంలో స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి.. కన్నడ రాజకీయ సంక్షోభం కొనసాగుతుందా.. కొలిక్కి వస్తుందా..? అనేది స్పష్టం కానుంది.
11:17 July 11
స్పీకర్‌ను కలవండి: రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీం ఆదేశం
కర్ణాటకకు చెందిన 10 మంది అసంతృప్త ఎమ్మెల్యేల వ్యాజ్యంపై విచారణ చేపట్టింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు .. అసంతృప్త ఎమ్మెల్యేలందరినీ కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ను కలవాలని ఆదేశించింది.
సభాపతిని కలిసి ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వాలని ఆదేశించింది కోర్టు. స్పీకర్ నిర్ణయం రేపు కోర్టుకు తెలపాలని సూచించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం.
10:43 July 11
నేడు మరికొందరు అసంతృప్తుల రాజీనామా...?
కర్ణాటకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. 10 మంది అసంతృప్తి ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంలో నేడు విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే.. మరోవైపు మరికొంతమంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు శాసనసభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్పీకర్‌ను కలవనున్నట్లు సమాచారం.
09:12 July 11
సభాపతి కార్యాలయం చేరుకున్న అసంతృప్త ఎమ్మెల్యేలు
కర్ణాటకకు చెందిన 10 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని నేడు సుప్రీం విచారించనుంది. సభాపతి ఉద్దేశపూర్వకంగానే తమ రాజీనామాలను ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ వారు పిటిషన్ దాఖలు చేశారు.