తెలంగాణ

telangana

నాయనమ్మ బాటలోనే సింధియా.. కాంగ్రెస్​కు టాటా భాజపాతో జట్టు

By

Published : Mar 11, 2020, 5:40 AM IST

Updated : Mar 11, 2020, 7:36 AM IST

యావత్తు దేశం దృష్టినీ ఆకర్షిస్తున్న మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో తాజా సంచలనానికి కేంద్ర బిందువు జ్యోతిరాదిత్య సింధియా. గ్వాలియర్‌ రాజవంశ వారసుడైన ఆయన కాంగ్రెస్‌ను వీడటం ఆ పార్టీకి పెద్ద కుదుపే. సింధియా భాజపాలో చేరడానికి సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం జ్యోతిరాదిత్య రాజకీయ ప్రయాణానికి.. అప్పట్లో ఆయన నాయనమ్మ విజయరాజె సింధియా ప్రస్థానానికి పోలికలున్నాయి. అదెలాగో చూద్దాం..

Jyotiraditya Scindia follows his grand mother's footsteps, quits Congress
నాయనమ్మ బాటలోనే సింధియా.. కాంగ్రెస్​కు టాటా భాజపాతో జట్టు

మధ్యప్రదేశ్‌లో కమల్​నాథ్​ ప్రభుత్వం కూలిపోతే అందుకు జ్యోతిరాదిత్యే ప్రధాన కారణమవుతారు. గతంలో కూడా ఇదేరీతిలో మధ్యప్రదేశ్‌లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోవడంలో.. సింధియా నాయనమ్మ విజయరాజె కీలకపాత్ర పోషించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సింధియా కుటుంబీకులు రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించారు. వారందరికీ ఏదో ఒకవిధంగా భాజపా లేదా దీని మాతృసంస్థ జన్‌సంఘ్‌తో సంబంధం ఉంది.

నాయనమ్మ బాటలోనే సింధియా

ఓటమెరుగని 'రాజె'మాత

భాజపా వ్యవస్థాపకుల్లో ఒకరైన ‘రాజమాత’ విజయరాజె సింధియాది ఏ ఎన్నికల్లోనూ ఓడిపోని ఘనత. గ్వాలియర్‌ను ఏలిన చివరి రాజు జీవాజీరావు సింధియా సతీమణి ఆమె. పెళ్లికి ముందు ఆమె పేరు లేఖాదేవి. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. వీరిలో ముగ్గురు రాజకీయ వారసత్వాన్ని కొనసాగించారు.

1957లో రాజకీయాల్లోకి వచ్చిన విజయరాజె తొలుత కాంగ్రెస్‌లో చేరి గుణ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. 1967లో అప్పటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి డీపీ మిశ్రాతో విభేదాలతో ఆమె జన్‌సంఘ్‌లో చేరారు. అనంతరం జన్‌సంఘ్‌ సభ్యులు, మరికొందరితో కలిసి సంయుక్త విధాయక్‌ దళ్‌ పేరిట ఓ కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. దీంతో నాటి ప్రభుత్వం పడిపోయి, కూటమికి చెందిన గోవింద్‌ నారాయణ్‌ సింగ్‌ ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం గ్వాలియర్‌ ప్రాంతంలో జన్‌సంఘ్‌ అభివృద్ధిలో విజయరాజె కీలకపాత్ర పోషించారు. ఫలితంగా 1971లో ఇందిరాగాంధీ ప్రభంజనంలోనూ 3చోట్ల జన్‌సంఘ్‌ అభ్యర్థులు గెలుపొందారు. వారిలో విజయరాజెతో పాటు మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ, ఆమె కుమారుడు మాధవరావు సింధియాలున్నారు. ఆమె 6 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1967 నుంచి 1971 వరకు రాష్ట్ర అసెంబ్లీలో కూడా సభ్యురాలు. రాజ్యసభ సభ్యురాలిగా (1978-1989) కూడా పనిచేశారు. ఎమర్జెన్సీ కాలంలో ఇందిరను తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె జైలుకు కూడా వెళ్లారు.

రాజకీయ వారసుడు జ్యోతిరాదిత్య

మాధవరావు సింధియా కుమారుడు జ్యోతిరాదిత్య తండ్రి బాటలో కాంగ్రెస్‌లోనే ఇంతవరకు కొనసాగారు. 2001లో మాధవరావు సింధియా ఓ విమాన ప్రమాదంలో కన్నుమూయగా అప్పటికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుణ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపాందారు. అనంతరం మూడు సార్లు గుణ నుంచి విజయం సాధించారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం తన చిరకాల ప్రత్యర్థి కృష్ణపాల్‌ సింగ్‌ యాదవ్‌ చేతిలో పరాజయం పాలయ్యారు.

తల్లికి తగ్గ తనయుడు మాధవరావు

విజయరాజే కుమారుడైన మాధవరావు సింధియా తొలుత జన్‌సంఘ్‌లో ఉన్నా 1977లో ఆ సంస్థతో, తల్లితో విభేదించారు. కాంగ్రెస్‌లో చేరి వరుసగా మూడుసార్లు ఎంపీ అయ్యారు. కాంగ్రెస్‌ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆయన కూడా ఓటమి ఎరుగని నేత.

కమలదళంలోనే కుమార్తెలు

విజయరాజె కుమార్తెలు వసుంధర రాజె, యశోధర రాజెలు మాత్రం తల్లి అడుగు జాడల్లోనే భాజపాలోనే కొనసాగారు. 1998లో వసుంధర వాజ్‌పేయీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో పనిచేశారు. అనంతరం రాజస్థాన్‌కు పంపగా అక్కడ విశేష ప్రజాదరణ పొందారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

* వసుంధరరాజె కుమారుడు దుష్యంత్‌ సింగ్‌ కూడా భాజపాలో కీలకనేత. ఆయన రాజస్థాన్‌లోని ఝలావర్‌ ఎంపీగా ఉన్నారు.

* యశోధర రాజె భాజపా తరఫున మధ్యప్రదేశ్‌లో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.

సింధియాకు రాచబాట!

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అసమ్మతి నేత జ్యోతిరాదిత్య సింధియాకు భాజపాకు మధ్య బరోడా రాజకుటుంబానికి చెందిన శుభాంగిని రాజె గైక్వాడ్‌ సంధానకర్తగా వ్యవహరించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. వీరి కథనం ప్రకారం.. బరోడా మహారాణి శుభాంగిని రాజె అంటే ప్రధాని మోదీకి అపార గౌరవం ఉంది. 2014లో వడోదరా లోక్‌సభ స్థానం నుంచి మోదీ పోటీ చేసినప్పుడు ఆయన నామినేషన్‌ను బలపరుస్తూ శుభాంగిని సంతకం చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌ తీరుపై కొంతకాలంగా గుర్రుగా ఉన్న జ్యోతిరాదిత్య.. ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టారు. దీన్ని గుర్తించిన శుభాంగిని.. ఈ నవతరం నేతకు మోదీకి మధ్య సంధానకర్తగా వ్యవహరించారు. జ్యోతిరాదిత్య భార్య ప్రియదర్శిని కూడా గైక్వాడ్‌ కుటుంబం నుంచే వచ్చారు.

Last Updated : Mar 11, 2020, 7:36 AM IST

ABOUT THE AUTHOR

...view details