కర్ణాటక రాజకీయాలు క్షణక్షణానికి ఆసక్తికరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా గోవా వెళ్లాలని నిశ్చయించుకున్న 10 మంది ఎమ్మెల్యేలు అనూహ్యంగా రూటు మార్చి ముంబయిలోని ఓ హోటల్‌కు చేరుకున్నారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముంబయి చేరారు. రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, ఎస్టీ సోమశేఖర్, మునిరత్న బెంగళూరులోనే ఉండిపోయారు.
సిద్ధరామయ్య నివాసంలో సమావేశం
ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో కాంగ్రెస్ కర్ణాటక వ్యవహారాల ఇన్‌ఛార్జి కేసీ వేణుగోపాల్ సీఎల్పీ నేత సిద్ధరామయ్య ఇంటికి చేరుకున్నారు. అక్కడ కేపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు ఈశ్వర్ ఖంద్రె, మంత్రులు డీకే శివకుమార్, డీకే సురేశ్ భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు.
ఎమ్మెల్యేలపై నమ్మకం ఉంది: ఖర్గే
రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై నమ్మకం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. వాళ్లందరూ ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉన్నారనీ, మనసు మార్చుకుని మళ్లీ మద్దతిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.