పూర్తిగా భద్రతా బలగాల నీడలోకి వెళ్లిన కశ్మీర్లో మంగళవారం జన జీవనం స్తంభించింది. అత్యవసర పనులు ఉన్నవారు మినహా మిగతావారంతా బిక్కుబిక్కుమంటూ ఇళ్లకే పరిమితమయ్యారు. విద్యాసంస్థలు తెరుచుకోలేదు. పలు ప్రాంతాల్లో అంతర్జాలం, మొబైల్ సేవలు నిలిచిపోవడం వల్ల బాహ్య ప్రపంచంతో వారికి సంబంధాలు తెగిపోయాయి.
కశ్మీరీల ఆందోళన
బయటి రాష్ట్రాల్లో స్థిరపడిన కశ్మీరీలు, లోయలో తమవారి పరిస్థితి ఎలా ఉందో తెలియక ట్విట్టర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారి క్షేమ సమాచారం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. అంతర్జాలం, కమ్యూనికేషన్ సేవలు నిలిచిపోవడం వల్ల అక్కడ రాతి యుగం వంటి పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.