కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తూ... తన వక్రబుద్ధిని చాటుకుంటోంది పాకిస్థాన్. దాయాది దళాలు బారాముల్లా జిల్లా రాంపుర్ సెక్టార్ వద్ద శుక్రవారం కాల్పులు జరిపాయి. ఆ ఘటనలో గాయపడ్డ ఇద్దరు జవాన్లు ఇవాళ ప్రాణాలు కోల్పోయారు. ఎదురుకాల్పుల్లో మొత్తం ముగ్గురు సిబ్బంది, ముగ్గురు పౌరులు గాయపడ్డారు. ఇందులో నాలుగేళ్ల బాలుడు కూడా ఉన్నాడు.
అక్కడ ఎన్కౌంటర్..
మరోవైపు.. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.
దంగెర్పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు.. నిర్బంధ తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. ముందే పసిగట్టిన ముష్కరులు కాల్పులు జరపగా.. ఎన్కౌంటర్కు దారితీసింది. అప్రమత్తమైన భారత సైన్యం.. దీటుగా బదులిస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.