ఉగ్రవాదులు, దేశద్రోహులు అంతర్జాలాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందునే జమ్ము కశ్మీర్లో సాధారణ ప్రజలు, మీడియాకు ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురాలేదని ప్రభుత్వ యంత్రాంగం స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 2జీ ఇంటర్నెట్ సేవలను పునఃప్రారంభించింది జమ్ముకశ్మీర్ ప్రభుత్వం. మొత్తం ఐదు జిల్లాల పరిధిలోని ఆస్పత్రులు, బ్యాంకులు, హోటళ్లులకు పోస్ట్ పెయిడ్ సహా బ్రాడ్ బ్యాండ్ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు హోంశాఖ ముఖ్య కార్యదర్శి షాలీనా కాబ్రా ఆదేశాలు జారీ చేశారు. అయితే మొబైల్ ఇంటర్నెట్ను మాత్రం తిరిగి ప్రారంభించలేదు.
ఎందుకంటే?
అంతర్జాలం ద్వారా ప్రజలకు తప్పుడు వార్తలు పంపించి ఉగ్రవాదంవైపు మొగ్గుచూపేలా ముష్కరులు ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారం అందినట్లు హోంశాఖ ప్రధాన కార్యదర్శి షాలీన్ కాబ్రా తెలిపారు. అంతర్జాలం పునరుద్ధరించడం ద్వారా వేర్పాటువాదులు సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ కారణంగానే కశ్మీర్ డివిజన్లో మొబైల్ అంతర్జాల సేవలను పునరుద్ధరించలేదని స్పష్టం చేశారు.