తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకే నేతలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల వేలూరు డీఎంకే అభ్యర్థి కదిర్ ఆనంద్ కార్యాలయం, ఆయన సిమెంటు గోదాంలో సోదాలు నిర్వహించింది ఐటీ శాఖ. నేడు ఆ పార్టీ దివంగత నేత కరుణానిధి కుమార్తె కనిమొళి నివాసంలోనూ తనిఖీలు చేపడుతోంది.
ఓటర్లకు పంపిణీ చేసేందుకు పెద్దఎత్తున డబ్బు నిల్వ ఉంచారన్న సమాచారంతో తనిఖీ చేస్తోంది ఐటీ శాఖ. తూత్తుకుడిలో కనిమొళి ఉంటున్న నివాసంలో 10మంది ఐటీ అధికారుల బృందం సాయంత్రం నుంచి సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఐటీ దాడులపై డీఎంకే శ్రేణులు మండిపడుతున్నాయి. తూత్తుకుడిలో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఐటీ దాడులపై డీఎంకే అధినేత స్టాలిన్ ఆగ్రహించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సుందరాజన్.. తన నివాసంలో కోట్ల డబ్బు దాచి ఉంచారని ఆరోపించారు. అధికారులు అక్కడ దాడులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఓడిపోతామనే భయంతోనే ఐటీ, సీబీఐలను ఉపయోగించి ప్రధాని నరేంద్ర మోదీ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు.
డీఎంకే నేత కనిమొళి నివాసంపై ఐటీ దాడులు ఇదీ చూడండి: తమిళనాడు వేలూరు లోక్సభ ఎన్నిక రద్దు