ఐటీ దాడులపై బోర్డు వివరణ కోరిన ఈసీ సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా విపక్ష నేతలు, సంబంధీకుల ఇళ్లలో జరుగుతున్న ఆదాయ పన్ను శాఖ దాడులపై ఎన్నికల సంఘం.. కేంద్ర ప్రభుత్వ వివరణ కోరింది. ఇందుకోసం కేంద్ర రెవెన్యూ కార్యదర్శి ఏబీ పాండే, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్మన్ పీసీ మోదీలను ఈసీ.. సమావేశానికి పిలిచింది.
రాజకీయ ఒత్తిడి లేదు...
ఈసీ ఆదేశాలపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, రెవెన్యూ విభాగం.. ఐటీ దాడుల వెనుక ఎటువంటి రాజకీయ ప్రోద్బలం లేదని స్పష్టం చేశాయి. ఐటీ దాడులు సహజంగా, నిష్పక్షపాతంగా జరుగుతున్నాయని తెలిపాయి.
కక్షపూరిత దాడులు?
లోక్‌సభ ఎన్నికల వేళ తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని కేంద్రం (భాజపా) ఐటీ దాడులు జరిపిస్తోందని కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఐటీ దాడులపై వివరణ ఇవ్వాలని ఈ ఇద్దరు ఉన్నతాధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది.
వివక్ష వద్దు..
ఎన్నికల సమయంలో ఐటీ దాడులు వివక్షకు తావులేకుండా తటస్థంగా ఉండాలని కేంద్ర ఆర్థికశాఖకు ఈసీ ఆదివారం స్పష్టం చేసింది. ఇకపై ఐటీ దాడులపై ముందుగా రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించింది ఈసీ.
అప్పటి నుంచే దాడులు తీవ్రం
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న ప్రకటించారు. అప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమల్లోకి వచ్చింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ల్లో విపక్షనేతలపై ఐటీ దాడులు తీవ్రమయ్యాయి.
నాయకుల గుండెల్లో 'ఐటీ' దాడులు
సోమవారం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, ఆయన అనుయాయులపై జరిపిన దాడుల్లో ఆదాయపన్ను శాఖ లెక్కల్లోకి రాని సుమారు రూ.281 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది.
దిల్లీ, మధ్యప్రదేశ్‌ల్లో చేపట్టిన ఐటీ దాడుల్లో రూ.14.6 కోట్ల లెక్క చూపని నగదును, పత్రాలను, కంప్యూటర్ ఫైళ్లను స్వాధీనం చేసుకున్నామని ఐటీ శాఖ ప్రకటించింది. మరో వైపు దిల్లీలోని ఓ ప్రముఖ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి తుఘ్లక్ రోడ్డులోని ఓ ప్రముఖ నేత ఇంటికి రూ.20 కోట్లు చేరినట్లు గుర్తించామని సీబీడీటీ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: భారత్ భేరి: ఎవరి మేనిఫెస్టోలో ఏముంది?