భారత నిఘావర్గాలు, భద్రతా దళాల అప్రమత్తతతో పాకిస్థాన్ ఐఎస్ఐ, ఉగ్రసంస్థల కుట్రలు బెడిసికొడుతున్నాయి. దేశంలో దాడులు నిర్వహించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే వాటి ప్రయత్నాలు సఫలీకృతం కావడం లేదు. అందుకే భారత్‌లో ఉగ్రదాడులు నిర్వహించేందుకు ఐఎస్ఐ కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నట్లు భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. స్థానికంగా ఉండే కరుడుగట్టిన నేరస్థులు, గ్యాంగ్స్టర్ల సాయంతో దాడులు జరిపేందుకు కుట్రలు పన్నుతున్నట్లు పేర్కొన్నాయి.
ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లకు మధ్య సంబంధాల గురించి చండీగఢ్ నిఘా విభాగం దేశంలోని ఇతర అన్ని నిఘా సంస్థల యూనిట్లను అప్రమత్తం చేసింది. కొందరు గ్యాంగ్స్టర్లను గుర్తించి వారి పేర్లను తెలియజేసింది. భారత్‌లో దాడులు నిర్వహించాలని వీరికి పాక్ ఐఎస్ఐ టాస్క్‌లు ఇస్తున్నట్లు వెల్లడించింది.
స్థానికంగా ప్రభావవంతమైన గ్యాంగ్స్టర్లతో ఐఎస్ఐ ఇప్పటికే సంప్రదింపులు జరిపే అవకాశాలున్నట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.