తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సగటు పౌరుని ఆకాంక్షలను రాజ్యాంగం నెరవేర్చిందా?

పాలకులకు, పాలితులకు మధ్య సంబంధాన్ని క్రమబద్ధం చేసే నిబంధనావళి రాజ్యాంగం. రాజ్యాంగబద్ధత ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ప్రజాస్వామ్యంలో పౌరులే పాలకులు, పాలితులు. అలాంటప్పుడు ప్రభుత్వాన్ని నియంత్రించడానికి రాజ్యాంగం అవసరమా? గత 7 దశాబ్దాలలో మన రాజ్యాంగం సగటు పౌరుని ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసిందా?

constitution of india
constitution of india

By

Published : Jan 26, 2020, 7:00 AM IST

Updated : Feb 18, 2020, 10:45 AM IST

భూమండలంపై మిగిలిన ప్రాణులతో పోలిస్తే మానవుడు హేతుబద్ధంగా వ్యవహరిస్తాడని, తోటివారితో సామరస్యంగా జీవిస్తూ.. వీలైనంతవరకు హానిచేయకుండా ఉంటాడని ప్రతీతి. అయితే ఆధునిక యుగంలో తరుగుతున్న వనరులు, పెరిగిపోతున్న జనాభా, వారి అవసరాలు మనుషుల్లో స్వార్థాన్ని పెంచాయి. ఫలితంగా ఘర్షణలు, విధ్వంసాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి దుష్ప్రవర్తనను అదుపులో పెట్టడానికి, నానాటికీ సంక్లిష్టమవుతున్న సామాజిక జీవనాన్ని సామరస్యంగా కొనసాగించడానికి అందరికీ ఆమోదయోగ్యమైన నియమనిబంధనల సంపుటి అవసరమైంది.. అదే రాజ్యాంగం.

ఆధునిక మానవుడు సంఘజీవి మాత్రమే కాదు.. రాజకీయ జీవి కూడా. తోటి వారితో కలిసి ఒక నిర్దిష్ట ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటుచేసుకుని, జీవితాన్ని క్రమబద్ధం చేసుకోవడానికి ఒక వ్యవస్థను రూపొందించుకున్నాడు. అదే రాజ్యం.

రాజ్యం ప్రభుత్వమనే వ్యవస్థను ఏర్పరచుకుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వాల ప్రధానాంగాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల వ్యవస్థీకరణ, అధికారాలు, విధులు, పౌరుల హక్కులు, బాధ్యతలు... ఇలాంటివన్నీ రాజ్యాంగంలో పొందుపరిచి ఉంటాయి. ఇది దేశంలో అత్యున్నత శాసనం. పాలకులకు, పాలితులకు మధ్య సంబంధాన్ని క్రమబద్ధం చేసే నిబంధనావళి రాజ్యాంగం.

రాజ్యానికి ఓ రకంగా అస్థిపంజరం లాంటిది రాజ్యాంగం. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలను పాలనలో భాగస్వామ్యం చేయడం.. ప్రజా ప్రతినిధులు, అధికారులు, న్యాయమూర్తులు ప్రజానీకానికి జవాబుదారీ వహించడం కీలకం. వీటికి చట్టబద్ధత కల్పించిందే రాజ్యాంగం. రాజ్యాంగబద్ధత ప్రజాస్వామ్యానికి మూలస్తంభం.

కీలక లక్ష్యాలు

ప్రజాస్వామ్యంలో పౌరులే పాలకులు, పాలితులు. అలాంటప్పుడు ప్రభుత్వాన్ని నియంత్రించడానికి రాజ్యాంగం అవసరమా? అంటే అవునన్నదే సమాధానం. ఈమేరకు కింది ఐదు కీలక లక్ష్యాలు నెరవేరాలంటే రాజ్యాంగమే సరైన సాధనం.

  • ప్రభుత్వాధికారాలను పరిమితం చేయడం
  • అధికార దుర్వినియోగం నుంచి సగటు పౌరున్ని కాపాడటం
  • ప్రస్తుత, భవిష్యత్తు సంతతిలో సంభవించే అనూహ్య మార్పులను తట్టుకోవడం
  • సమాజంలో అణగారిన వర్గాలకు సాధికారిత కల్పించడం
  • కృత్రిమ అసమానతలను తొలగించి, సమ సమాజ స్థాపన

ఈ లక్ష్యాలను సాధించడానికి మనరాజ్యాంగంలో కొన్ని పరిరక్షణలు పొందుపరిచారు. అవి..

హక్కులతో రక్ష

భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు పౌరస్వేచ్ఛను పరిరక్షిస్తూ, రాజ్యాధికారాన్ని పరిమితం చేస్తాయి. ఆదేశసూత్రాలు సామాజిక, ఆర్థిక న్యాయాన్ని సాధించేందుకు రాజ్యాన్ని ఆదేశిస్తాయి. రాజ్యాంగం ప్రసాదించిన మత స్వాతంత్య్రపు హక్కు, మతపరమైన అల్పసంఖ్యాక వర్గాల్లో భద్రతాభావాన్ని కలిగిస్తుంది. లౌకికవాదం.. మత, సాంస్కృతిక విషయాల్లో రాజ్యపు జోక్యాన్ని నిషేధిస్తుంది. రాజ్యాంగ 17వ ప్రకరణ అనాదిగా కొనసాగుతున్న అంటరానితనమనే సాంఘిక దురాచారాన్ని నిషేధించింది. ఇలాంటి హామీలన్నీ ఒక ఎత్తయితే.. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయడం మరో కీలకాంశం.

అర్ధ సమాఖ్య

సమాఖ్య వ్యవస్థకు నాంది పలికిన అమెరికా రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని ప్రభావితం చేసినప్పటికీ.. మన రాజ్యాంగ నిర్మాతలు అర్ధ సమాఖ్య వ్యవస్థ వైపు మొగ్గుచూపారు. మత ప్రాతిపదికన భారత ఉపఖండం విడిపోవడం, ఈశాన్య సరిహద్దు ప్రాంతాల ప్రజల వేర్పాటువాద ధోరణి.. విలక్షణీయమైన రాజ్యాంగ అమరికకు పురిగొల్పాయి. అదే బలమైన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర సహకారంతో పనిచేసే రాష్ట్ర ప్రభుత్వాలతో కూడినదే అర్ధ సమాఖ్య.

పార్లమెంటరీ ప్రభుత్వం

భారత ప్రజలకు అధ్యక్ష, పార్లమెంటరీ తరహా వ్యవస్థల్లో ఏది మేలన్నది కూలంకషంగా పరిశీలించిన మన రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్నే ఎంపిక చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు, వర్గాలకు పాలన బాధ్యతల్లో సముచిత స్థానాన్ని కల్పిస్తూ.. అధ్యక్ష తరహా వ్యవస్థలో తలెత్తే అధికార కేంద్రీకరణను ఇది నివారిస్తుంది. పరిమిత కాల నిరంకుశ వ్యవస్థ స్థానంలో, మారే రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాల ఏర్పాటు, అవసరమైతే వాటి తొలగింపునకు మార్గం సుగమం చేసేదే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. అందుకే ప్రజాస్వామ్య దేశాల్లో మూడింట రెండొంతుల ప్రభుత్వాలు దీనివైపు మొగ్గు చూపాయి.

ఆకాంక్షలు నెరవేరాయా?

గత 70 ఏళ్లలో మన రాజ్యాంగం సగటు పౌరుని ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసిందా? అంటే అవును.. కాదు.. అనే రెండు సమాధానాలూ వస్తాయి. రెండో ప్రపంచ యుద్ధానంతరం స్వాతంత్య్రాన్ని పొందిన అనేక దేశాలు ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశం వైపు మళ్లాయి. యుగొస్లేవియా, సోవియట్‌ యూనియన్‌, సూడాన్‌ లాంటి దేశాలు విచ్ఛిన్నమయ్యాయి. భారతదేశం మాత్రం నేటికీ ప్రజాస్వామ్య దేశంగా కొనసాగుతూ తన ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించుకుంటోందంటే అది మన రాజ్యాంగంలో పొందుపరిచిన అదుపులు, అన్వయాల(చెక్స్‌ అండ్‌ బ్యాలెన్సెస్‌) ఫలితమే.

అయితే ప్రపంచ దేశాల్లో తనకంటూ విశిష్ట స్థానాన్ని సంపాదించిన మన దేశంలో సాధారణ పౌరుడు సుఖంగా జీవిస్తున్నాడా అంటే.. లేదు అని ఒప్పుకోవాల్సి వస్తుంది. రోజురోజుకూ క్షీణిస్తున్న నైతిక విలువలు; పెరుగుతున్న సంకుచితత్వం; ప్రాంతీయ, భాషా, మతోన్మాదాలు; నేరపూరిత రాజకీయాలు; రాజకీయ పక్షాల అవకాశవాదం వంటి పెడ ధోరుణలన్నీ "ఇది గాంధీజీ కలలుగన్న దేశమేనా?" అనే అనుమానాల్ని లేవనెత్తుతున్నాయి. దీనికి వ్యక్తిగతంగా, సామూహికంగా మనమందరమూ బాధ్యులమే. బాధ్యతల నిర్వహణలో అన్ని పక్షాలూ విఫలమవుతున్నాయి. తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ఈ వర్గాలు రాజ్యాంగం వైపు వేలెత్తి చూపుతున్నాయి. సమగ్రతను, సమతను, ప్రగతిని కాపాడాల్సిన బాధ్యత మనందరి పైనా ఉంది.

(రచయిత- డాక్టర్‌ బి.జె.బి.కృపాదానం, రాజనీతి శాస్త్ర అధ్యాపకులు)

Last Updated : Feb 18, 2020, 10:45 AM IST

ABOUT THE AUTHOR

...view details