తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంటర్నెట్​పై సర్వోన్నత తీర్పు అభినందనీయం

జమ్ముకశ్మీర్​ ఆంక్షలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై జాతీయ మీడియా ప్రశంసలు కురిపించింది. ఇంటర్నెట్​ ప్రాధమిక హక్కేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడంపై జాతీయ పత్రికలన్నీ హర్షం వ్యక్తం చేశాయి.

Supreme
సుప్రీం కోర్టు

By

Published : Jan 12, 2020, 7:30 AM IST

ఇంటర్నెట్‌ ప్రాథమిక హక్కేనని, దానిద్వారా వ్యక్తంచేసే అభిప్రాయాలు, వాణిజ్య వ్యాపారాలకు రాజ్యాంగ రక్షణ ఉంటుందంటూ జమ్ముకశ్మీర్‌ కేసులో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై జాతీయ మీడియా ప్రశంసలు గుప్పించింది. కశ్మీర్‌లో తలుపుల్ని కోర్టు తెరిచిందని, ఆలస్యమైనా అభినందనీయమైన తీర్పు చెప్పిందని దాదాపు జాతీయ పత్రికలన్నీ శనివారం సంపాదకీయాల్లో పేర్కొన్నాయి. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌లు ఇచ్చిన తీర్పు కశ్మీర్‌లో నవోదయానికి శ్రీకారం చుడుతుందని హిందుస్థాన్‌ టైమ్స్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రికలు అభిప్రాయపడ్డాయి. ఇంటర్నెట్‌ ప్రాథమిక హక్కేనంటూ కేరళ హైకోర్టు లోగడ ఇచ్చిన తీర్పును ఇప్పుడు సుప్రీంకోర్టు ధ్రువీకరించినట్లయిందని పేర్కొన్నాయి. దేశంలో ఇటీవలి కాలంలో తరచూ ఇంటర్నెట్‌ను నిలిపివేస్తున్న తరుణంలో ఈ తీర్పు అత్యంత ప్రాధాన్యం సంతరించుకొందని వ్యాఖ్యానించాయి. దీని ద్వారా జమ్ము-కశ్మీర్‌కే కాకుండా యావద్దేశానికి లబ్ధి కలుగుతుందని పేర్కొన్నాయి. ఇంటర్నెట్‌ సేవలు రాజ్యాంగంలోని 19వ అధికరణం కిందికి వస్తాయని, 144 సెక్షన్‌ విధిస్తూ జారీచేసిన ఆంక్షలను తక్షణం సమీక్షించాలని ఆదేశించడం స్వాగతించదగినదని వ్యాఖ్యానించాయి.

భావ ప్రకటనకు భద్రత..

ఆర్టికల్‌ 19 కింద రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛపై పరిమితులు విధించడానికి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే వీలవుతుందని, అప్పుడూ స్పష్టమైన ఆధారాలు చూపాల్సి ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం చెప్పడాన్ని జాతీయ పత్రికలన్నీ అభినందించాయి. ఈ తీర్పు ద్వారా న్యాయస్థానం రాజ్యాంగబద్ధమైన పాత్రను సక్రమంగా పోషించగలిగినట్లు ప్రశంసించాయి. భావప్రకటన స్వేచ్ఛకు సంపూర్ణ భద్రత కల్పిస్తూ మంచి తీర్పు ఇచ్చిందని వ్యాఖ్యానించాయి. ఇంటర్నెట్‌ పొందడం ప్రాథమిక హక్కు అని కేవలం వ్యాఖ్యానాల ద్వారా చెప్పకుండా అది 19(1) అధికరణంలో అంతర్భాగమని చెప్పడం అభినందనీయమని కొనియాడాయి.

ఉల్లంఘనపైనా చెబితే బాగుండేది

సమాచారం విస్తృతంగా వ్యాప్తి చెందడం వల్ల ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న కారణంతో ఇంటర్నెట్‌ను నిలిపేశామని సమర్థించుకోవడం వీలుకాదన్న ఈ తీర్పు ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాంటిదని జాతీయ పత్రికలు వ్యాఖ్యానించాయి. జమ్ము కశ్మీర్‌ ప్రజల కదలికలపై ఆంక్షలు విధిస్తూ జారీచేసిన ఉత్తర్వులను సమర్పించడానికి నిరాకరించిన ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించడాన్ని అభినందించాయి. కోర్టు చాలా అంశాలపై విలువైన ఉత్తర్వులు జారీ చేసిందని, అదే సమయంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించిందా? లేదా? అనేది చెప్పి ఉంటే బాగుండేదని మరో పత్రిక అభిప్రాయపడింది.

ఇదీ చూడండి:'జమ్ము కశ్మీర్​ సందర్శనకు భారత్ నన్ను ఆహ్వానించలేదు'

ABOUT THE AUTHOR

...view details